టీఎస్ ఆర్‌జేసీ సెట్ - 2025 రిజల్ట్స్ వచ్చేశాయ్. ఈ ఎంట్రెన్స్ ఆధారంగా రాష్ట్రంలోని గురుకుల రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలను కల్పిస్తారు. 2025 - 26 విద్యా సంవత్సరానికి గాను సీట్లు కేటాయిస్తారు. పరీక్ష రాసిన అభ్యర్థులు tgrjc.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు పొందేందుకు మే 10వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం 35 టీఎస్ఆర్జేసీ కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో 15 బాలురు, 20 బాలికల కాలేజీలు ఉండగా… ఎంట్రెన్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారికి సీట్లను కేటాయిస్తారు.
ర్యాంకులతో పాటు రిజర్వేషన్ల ఆధారంగా… ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోని ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. దాదాపు 3 వేల వరకు సీట్లను భర్తీ చేసే అవకాశం ఉంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలను మే 24న విద్యార్థుల మొబైల్స్‌కు సమాచారం అందుతుంది.
టీఎస్ఆర్జేసీ - 2025 ప్రవేశపరీక్షను మల్టీపుల్ ఛాయిస్ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహించారు. ఎంపీసీ విద్యార్థులకు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్,బైపీసీ విద్యార్థులకు బయోలజీ, ఫిజిక్స్, ఇంగ్లీష్, ఎంఈసీ విద్యార్థులు ఇంగ్లిష్, సోషల్ స్టడీస్, మ్యాథ్స్‌లో ప్రశ్నలు అడిగారు. ఈ ప్రవేశ పరీక్షను హైదరాబాద్ , రంగారెడ్డితో పాటు మరికొన్ని జిల్లాల్లో నిర్వహించారు.