తెలంగాణ లాసెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఎలాంటి ఫైన్ లేకుండా ఏప్రిల్ 15వ తేదీతో పూర్తి అయింది. ఈ నేపథ్యంలో అధికారులు కీలక అప్జేట్ ఇచ్చారు. దరఖాస్తుల గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగించారు. ఎలాంటి ఫైన్ లేకుండానే ఈ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవచ్చని తాజా ప్రకటనలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 30వ తేదీ దాటితే అభ్యర్థులు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. 2025-26 విద్యాసంవత్సరానికి ఈ అడ్మిషన్లు ఉంటాయి. తెలంగాణ ఉన్నత విద్యా మండలి తరపున ఉస్మానియా యూనివర్శిటీ ప్రవేశ పరీక్ష బాధ్యతలను చూస్తోంది. గతేడాది కూడా ఓయూనే నిర్వహించింది.
టీజీ లాసెట్ - 2025కు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 900, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి. పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే జనరల్ అభ్యర్థులు రూ. 1100, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 900 చెల్లించాలి.
మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలకు అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తి చేసి ఉండాలి. ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాలకు డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి వయోపరిమితి ఉండదు.
ఇక ఆన్ లైన్ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ మే 20వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది. మే 25 వరకు అవకాశం ఉంటుంది. ఇక మే 30వ తేదీన హాల్ టికెట్లు విడుదలవుతాయి. జూన్ 6వ తేదీన లాసెట్ ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం సమయంలో మూడేళ్ల కోర్సుల ప్రవేశ పరీక్ష, మద్యాహ్నం ఐదేళ్ల కోర్సు, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఎగ్జామ్ ఉంటుంది.