TG ICET Schedule 2025 : తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ విడుదల - మార్చి 10 నుంచి దరఖాస్తులు, ముఖ్య వివరాలివే
TG ICET Schedule 2025 Updates: ఈ ఏడాదికి సంబంధించి ఐసెట్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి షెడ్యూల్ మార్చి 6న విడుదలవుతుంది. మార్చి 10 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది.
తెలంగాణ ఐసెట్ షెడ్యూల్ వచ్చేసింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఏంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ ఏడాది నల్గొండలోని మహాత్మ గాంధీ యూనివర్శిటీ ఈ పరీక్షల నిర్వహణ బాధ్యతలను చూస్తోంది.
మార్చి 10 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు….
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఐసెట్ నోటిఫికేషన్ మార్చి 6న విడుదల కానుంది. మార్చి 10 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 3వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఐసెట్ పరీక్షలను జూన్ 08,09 తేదీల్లో నిర్వహిస్తారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒక షిఫ్ట్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 02.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు మరో షిఫ్ట్ లో ఎగ్జామ్స్ ఉంటాయి. దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ. 550 చెల్లించాలి. ఓబీసీ అభ్యర్థులు రూ. 750 చెల్లించాలని అధికారులు తెలిపారు.
టీజీ ఐసెట్ ముఖ్య వివరాలు :
- తెలంగాణ ఐసెట్ నోటిఫికేషన్ జారీ - 6 ఫిబ్రవరి 2025
- అప్లికేషన్లు ప్రారంభం - 10 మార్చి 2025
- దరఖాస్తులకు చివరి తేదీ - 3 మే 2025
- పరీక్ష తేదీలు - 8, 9, జూన్ 2025
ఈ టీఎస్ ఐసెట్–2025 పరీక్షను తెలంగాణ, ఏపీ రెండు రాష్ట్రాల్లో నిర్వహించనుండగా.. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా 20కి పైగా ఆన్ లైన్ టెస్ట్ జోన్లను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఆ సెంటర్లు ఎక్కడెక్కడ అనేది వర్సిటీ వెబ్ సైట్ లో వివరాలు అందుబాటులో ఉంటాయి. నోటిఫికేషన్ విడుదలైతే పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
గతేడాదిలో ఐసెట్ అడ్మిషన్ల కోసం చాలా మంది ఆసక్తి చూపారు. దాదాపు అన్ని సీట్లు కూడా భర్తీ అయిన పరిస్థితి కనిపించింది. గతేడాది ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లోనే దాదాపు 85 శాతానికి పైగా సీట్లు భర్తీ అయ్యాయి. ఒక్క ఫస్ట్ ఫేజ్ లోనే 30వేలకు పైగా సీట్లు నిండిపోయాయి. మిగతా సీట్లను సెకండ్ ఫేజ్, స్పెషల్ ఫేజ్ ద్వారా భర్తీ చేశారు. ఇక ఈసారి కూడా ఐసెట్ అడ్మిషన్లకు భారీగానే డిమాండ్ ఉండే అవకాశం ఉందని విద్యా నిపుణులు అంచనా వేస్తున్నారు.
సంబంధిత కథనం