తెలంగాణ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. దీంతో క్వాలిఫై అయిన విద్యార్థులు కాలేజీల ఎంపిక విషయంలో కసరత్తు మొదలుపెట్టారు. తమ ర్యాంకుల ఆధారంగా ఏ కాలేజీ అయితే బెటర్ అన్నదానిపై క్లారిటీ తీసుకునే పనిలో పడ్డారు. ఏ కాలేజీలో చేరితే మంచి అవకాశాలు ఉంటాయనే దానిపై ఓ అవగాహనకు వచ్చే పనిలో ఉన్నారు.
గతేడాదితో పోల్చితే ఈసారి ముందుగానే ఈఏపీసెట్ పరీక్షలు ముగిశాయి. అయితే ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ ను జూన్ నెలాఖరు లేదా జూలై మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిపై ఉన్నత విద్యా మండలి నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.
ఫలితాలు వచ్చిన నేపథ్యంలో…. ఏ క్షణమైనా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. అయితే ర్యాంకుల ఆధారంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ముందుగానే కాలేజీల ఎంపికపై విషయంలో ఓ స్పష్టతకు రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
గతంలో మాదిరిగానే ఈసారి కూడా సీఎస్‌ఈకి చాలా డిమాండ్ ఉండే అవకాశం ఉంటుంది. ఈ కోర్సులో చేరేందుకు విద్యార్థులు తెగ ఆసక్తి చూపుతుంటారు. ఈ కోర్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే…. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉండే విద్యార్థులు… కంప్యూటర్ సైన్స్ కోర్సులను ఎక్కువగా ఎంచుకుంటున్నారు.
రాష్ట్రంలోని కొన్ని పేరొందిన కళాశాలల్లో సీట్లకు తెగ డిమాండ్ ఉంటుంది. ప్రతి ఏడాది కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఆయా కాలేజీల్లో ఫీజులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇక యాజమాన్య కోటా సీట్ల గురించి ఇప్పటికే చాలా మంది ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. యాజమాన్య కోటాలో అయితే ర్యాంక్ తో సంబంధం లేకుండా నేరుగా ఫీజు చెల్లించి చేరే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉంటే ఈఏపీసెట్ ఫలితాల్లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు… ఏ కాలేజీలో చేరితే బాగుంటుందనే విషయంపై ఆరా తీస్తుంటారు. అయితే జేఈఈ వంటి పరీక్షలు రాసి ఉత్తీర్ణులైన విద్యార్థులు… దేశంలోని ప్రముఖ ఐఐటీలతో పాటు మరికొన్ని జాతీయ విద్యా సంస్థల్లో చేరే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితి లేకుండా ఈఏపీసెట్ లో మంచి ర్యాంకు సాధించిన వారు మాత్రం… రాష్ట్రంలోని ప్రముఖ కాలేజీల్లో చేరేందుకు ఆసక్తి చూపుతారు.
రాష్ట్రంలో 175 ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. వీటిల్లో ఒక లక్షకుపైగా బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో కొన్ని పేరొందిన కాలేజీలు ఉన్నాయి. ఆ వివరాలను ఇక్కడ ఓసారి చూడండి….
హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సీట్లకు చాలా డిమాండ్ ఉంటుంది. టాప్ ఇంజినీరింగ్ కాలేజీల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ ప్లేస్ మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. గతంలో ఇక్కడ విద్యను పూర్తి చేసిన వాళ్లు… పలు అంతర్జాతీయ కంపెనీలకు సీఈవోలుగా పని చేస్తున్నారు.
హైదరాబాద్ లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ…. ప్రముఖ కాలేజీలో ఒకటిగా ఉంది. ఇది ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీ. ఇక్కడ సీటు చాలా తక్కువ ర్యాంక్ ఉండాలి. రిజర్వేషన్ బట్టి కటాఫ్ మారొచ్చు. ప్రతి ఏడాది కూడా కటాఫ్ మారిపోతుంటుంది.
ఇంజినీరింగ్ టాప్ కాలేజీల్లో ఒకటిగా సీబీఐటీ ఒకటిగా ఉంది. ఇది హైదరాబాద్ లోని గండిపేటలో ఉంటుంది. ఇక్కడ్నుంచి ఇంజినీరింగ్ పూర్తి చేసే మంచి భవిష్యత్ ఉంటుంది. ప్లేస్ మెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కాలేజీలో కూడా సీటు పొందాలంటే కూడా మంచి ర్యాంక్ రావాల్సిందే.
రంగారెడ్డి జిల్లా నాదర్ గుల్ లోని ఎంవీఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీకి మంచి పేరుంది. ఇక్కడ చేరేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. ఇక్కడ సీటు రావాలంటే మంచి ర్యాంక్ రావాల్సిందే. ఇక్కడ సీట్లకు తెగ డిమాండ్ ఉంటుంది.
హైదరాబాద్ చుట్టపక్కన ఉన్న వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గోకరాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ తో పాటు శంషాబాద్ ప్రాంతంలో ఉన్న వర్ధమాన్ కాలేజీ కూడా ఇంజినీరింగ్ విద్యకు మంచి ఆప్షన్ గా చెప్పొచ్చు. ఇవే కాకుండా ఇబ్రహీంపట్నం పరిధిలో ఉన్న సీవీఆర్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ తో పాటు మరికొన్ని కూడా పేరొందిన కాలేజీలుగా ఉన్నాయి.
పైన పేర్కొన్న కాలేజీల వివరాలు కేవలం అవగాహన కోసమే ఇచ్చాం. టీజీ ఈఏపీసెట్ 2025లో వచ్చిన ర్యాంకుతో పాటు రిజర్వేషన్ల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆయా కాలేజీల పూర్తి సమాచారం తెలుసుకోవటంతో పాటు అక్కడ చదవితే ఎలాంటి అవకాశాలు ఉంటాయన్న అవగాహనతోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గతేడాది జరిగిన సీట్ల కేటాయింపు, కటాఫ్ వివరాల ఆధారంగా కూడా ఓ అంచనాకు రావొచ్చు.
ఇక విద్యార్థులు నేరుగా చేరాలనుకునే కాలేజీల సమాచారం తెలంగాణ ఉన్నత విద్యా మండలి వెబ్ సైట్ నుంచి కూడా పొందవచ్చు. లేదా జేఎన్టీయూ వెబ్ సైట్ లోకి వెళ్లి అనుబంధంగా ఉన్న కాలేజీల సమాచారం తెలుసుకోవచ్చు.
సంబంధిత కథనం