బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అయితే కాలేజీల ఎంపిక కోసం వెబ్ ఆప్షన్లు రేపట్నుంచే(జూలై 6) అందుబాటులోకి రానున్నాయి. అర్హులైన విద్యార్థులు… జూలై 10వ తేదీ వరకు ఆప్షన్లను ఎంచుకోవచ్చు.
విద్యార్థులు సీట్లు పొందే విషయంలో కాలేజీల ఎంపిక చాలా కీలకం. అయితే ర్యాంక్ ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. దీనికితోడు రిజర్వేషన్లను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి వెబ్ ఆప్షన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. గతేడాది కటాఫ్ పై కూడా ఓ అంచనా ఉంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీలోని ప్రమాణాలు, ప్లేస్ మెంట్ తో పాటు ఇతర అంశాలను బేరీజీ వేసుకొని కాలేజీలను ఎంచుకోవటం మంచిందని పేర్కొంటున్నారు.
రాష్ట్రంలో 156 ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీలున్నాయి. ప్రభుత్వ వర్సిటీలకు చెందిన కాలేజీలు మరో 19 ఉన్నాయి. మొత్తం 175 కాలేజీలు గత ఏడాది కౌన్సెలింగ్‌లో పాల్గొన్నాయి.వీటిల్లో మొత్తం 1,18,989 సీట్లున్నాయి. అయితే ఈసారి ఎన్ని సీట్లు అందుబాటులో ఉంటాయనే దానిపై మరికొంత స్పష్టత రావాల్సి ఉంది. దీనికి కారణం లేకపోలేదు.
ఈ ఏడాది పాలమూరు యూనివర్శిటీతో పాటు శాతవాహన వర్సిటీ పరిధిలోని హుస్నాబాద్‌లో కొత్త కళాశాలలు మంజూరయ్యాయి. వీటిల్లో మరికొన్నిసీట్లు అందుబాటులో ఉండనున్నాయి. దీనికితోడు గతేడాది కొన్ని సీట్లకు ఏఐసీటీఈ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినప్పటికీ… వీటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో పలు కాలేజీల్లో వీటికైనా అనుమతి ఇవ్వాలని కోరుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం వెబ్ ఆప్షన్లకు సమయం దగ్గరపడటంతో… కొత్త సీట్ల విషయంలో సందిద్ఘత నెలకొంది. అయితే సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ నాటికి ఒక నిర్ణయం తీసుకుంటే… మరికొన్ని సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది.
శనివారం(జూలై 5) సాయంత్రానికి గుర్తింపు పొందిన కాలేజీలు, సీట్ల వివరాలు సాంకేతిక విద్య విభాగానికి పంపుతామని జేఎన్టీయూహెచ్ అధికారులు చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరలోనే కొత్త సీట్లపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి అయితే… అందుబాటులో ఉన్న సీట్లకే విద్యార్థులు పోటే పడే అవకాశం ఉంది.
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభ్యర్థులకు… జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 6 నుంచి జూలై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది. జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం