రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే అర్హత సాధించిన అభ్యర్థులు… ఇవాళ్టి నుంచి (జూలై 6) నుంచి వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూలై 10వ తేదీతో ఈ గడువు పూర్తవుతుంది.
ఈఏపీసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా రిజిస్రేషన్ చేసుకునే అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థి సాధించే ర్యాంక్ ఎంతో కీలకం. అంతేకాకుండా రిజర్వేషన్ ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. రెండింటి ఆధారంగా…. సీటును కేటాయిస్తారు. కాబట్టి వెబ్ ఆప్షన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. కాలేజీలోని ప్రమాణాలు, ప్లేస్ మెంట్ తో పాటు ఇతర అంశాలను బేరీజీ వేసుకొని కాలేజీలను ఎంచుకోవటం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. https://tgeapcet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈఏపీసెట్ రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేసుకున్న అభ్యర్థులకు… జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. జూలై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించారు. జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది. జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం కల్పిస్తారు. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
ఈ ఏడాది నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉన్నత విద్యా మండలి కొన్ని మార్పులు తీసుకువచ్చింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు మాక్ కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ విధానంలో భాగంగా విద్యార్థికి వచ్చిన ర్యాంక్… ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా మాక్ సీట్(ప్రాథమికంగా) అలాట్‌మెంట్ చేస్తారు. విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం ఇస్తారు. చివరగా ఫైనల్ సీట్ అలాట్‌మెంట్ చేస్తారు.
ఈ విధానంతో…. విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది. ఆ తర్వాత ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. అంటే జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయిస్తారు.