తెలంగాలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రెండు విడుతలు పూర్తి కాగా... ప్రస్తుతం మూడో విడత ప్రవేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు జూన్ 19వ తేదీతో పూర్తయింది. ఈ నేపథ్యంలో అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది.
దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్లకు గడువును ఈనెల 25 వరకు పొడిగించారు. ఈ తేదీల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అభ్యర్థులు.. వెబ్ ఆప్షన్లను కూడా ఎంచుకోవాలి. ఇందుకు కూడా జూన్ 25వ తేదీనే తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 28వ తేదీన విద్యార్థులకు సీట్లను కేటాయిస్తారు. జూన్ 28 నుంచి 30 తేదీల మధ్య ఆన్ లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. అంతేకాకుండా జూన్ 28 నుంచి జూలై 1వ తేదీల మధ్య ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.
జూన్ 30వ తేదీ నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి. జూలై 1 నుంచి 4వ తేదీ వరకు కాలేజీల్లో ఓరియేంటేషన్ కార్యక్రమాలు ఉంటాయి. సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయకపోతే సీటు రద్దవుతుంది. కాబట్టి దోస్త్ ద్వారా సీటు పొందే విద్యార్థులు... తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.,
దోస్త్ మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది.