తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ, ఇదే ఫైనల్ ఛాన్స్..!-tg dost 2025 third phase registrations begins key dates here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ, ఇదే ఫైనల్ ఛాన్స్..!

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ, ఇదే ఫైనల్ ఛాన్స్..!

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. తాజాగా మూడో విడత రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. సీట్లు రాని విద్యార్థులతో పాటు కొత్తవాళ్లు దోస్త్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు

దోస్త్ - 2025 ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా… అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. శుక్రవారం నుంచే థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు.. జూన్ 19వ తేదీ వరకు దోస్త్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు…

దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలైంది. ఈ గడువు జూన్ 19తో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లు చేసుకున్న వాళ్లు ఈ తేదీల్లోనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్‌ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూన్ 24 నుంచి 28వ తేదీల మధ్య ఓరియేంటేషన్ ఉంటుంది. జూన్ 30వ తేదీన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.

దోస్త్ అన్ని విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ ను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా షెడ్యూల్ జారీ చేస్తారు.

‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…

  1. ముందుగా దోస్త్ అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. చివరల్లో Aadhaar Authentication ప్రక్రియ పూర్తవుతుంది.
  4. ఆ తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
  5. దీని ద్వారా మీ లాగిన్ ప్రక్రియ ముందుకెళ్తుంది.
  6. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా నిర్ణయించిన ఫీజును తప్పకుండా చెల్లించాలి.
  7. దోస్త్ లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు:

దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్లను శుక్రవారం కేటాయించారు. ఈ ఫేజ్ లో కొత్తగా 37,491 మంది సీట్లు పొందారు. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొంది మరోసారి కళాశాలల కోసం వెబ్‌ ఆప్షన్లు పెట్టుకున్న మరో 6,077 మందికి కూడా సీట్లు దక్కాయి. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 18 వ తేదీ నాటికి ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకోవాలి. లేకపోతే సీటు రద్దయ్యే అవకాశం ఉంటుంది.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.