తెలంగాణలో పీజీ ప్రవేశాలు...! ఈ వారంలోనే ‘సీపీగెట్‌ - 2025’ నోటిఫికేషన్‌..!-tg cpget notification 2025 likely to be released this week ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  తెలంగాణలో పీజీ ప్రవేశాలు...! ఈ వారంలోనే ‘సీపీగెట్‌ - 2025’ నోటిఫికేషన్‌..!

తెలంగాణలో పీజీ ప్రవేశాలు...! ఈ వారంలోనే ‘సీపీగెట్‌ - 2025’ నోటిఫికేషన్‌..!

తెలంగాణలో పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ వారంలోనే సీపీగెట్ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎంట్రెన్స్ ద్వారా రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం, ఎంపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు.

ఉస్మానియా వర్శిటీ

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ పరీక్షకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కీలకమైన ఎంట్రెన్స్ పరీక్షల నోటిఫికేషన్లు రాగా... పరీక్షలు కూడా పూర్తవుతున్నాయి. అయితే సీపీగెట్ నోటిఫికేషన్ మాత్రం ఇంకా రాలేదు. కొన్ని కారణాలతో ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

ఈ వారంలోనే నోటిఫికేషన్…

గతేడాదిలో మే 16వ తేదీన సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి జూన్ మాసం వచ్చినా ఇంకా రాలేదు. అయితే ఈ వారం రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే ప్రవేశ బాధ్యతలు చూడనుంది.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.

టీజీ సీపీగెట్ పరీక్షలు మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.మొత్తం 100 ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అడుగుతారు. బయోకెమిస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, ఫోరెన్సిక్ సైన్స్, జెనిటిక్స్ అండ్ మైక్రోబయాలజీ సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ పార్ట్-ఎలో కెమిస్ట్రీ నుంచి 40 ప్రశ్నలు, పార్ట్ బిలో ఫిజిక్స్, బోటనీ, జువాలజీ, జెనిటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీల్లోని ఆప్షనల్ సబ్జెక్టు (బీఎస్సీలో చదివిన) నుంచి 60 ప్రశ్నలు వస్తాయి. బయోటెక్నాలజీ పేపర్‌లో పార్ట్-ఎ (కెమిస్ట్రీ)లో 40 ప్రశ్నలు, పార్ట్-బి (బయోటెక్నాలజీ)లో 60 ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.