రాష్ట్రంలోని పీజీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ సీపీగెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయ్. పలు సబ్జెక్టుల పరీక్షలు రాసిన విద్యార్థులు… సీపీగెట్ వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ మేరకు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు వివరాలను వెల్లడించారు.
ఆగస్టు 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు టీజీ సీపీగెట్ - 2025 పరీక్షలు జరిగాయి. ప్రతి రోజూ 3 సెషన్ల్లలో నిర్వహించారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరిగాయి.
ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహించారు. ర్యాంకుల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.
ప్రస్తుతం కొన్ని సబ్జెక్టుల ఎంట్రెన్స్ ఫలితాలను మాత్రమే ప్రకటించగా… మరికొన్నింటివి త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ రిజల్ట్స్ ను కూడా https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.