తెలంగాణ టెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయి.
ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్ నిర్వహిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
పరీక్షలు రాసే అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎగ్జామ్ సెంటర్ లోకి స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించవు. హాల్ టికెట్ తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటి అధికారిక ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి.
ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్-1కు 63,261 , పేపర్-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారి సంఖ్య 15 వేలకుపైగా ఉంది. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి.
జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.
తెలంగాణ టెట్ పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. ఆపై ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. జూలై 22వ తేదీన టెట్ తుది ఫలితాలను ప్రకటిస్తారు.