TG Inter Exams 2025 : విద్యార్థులూ... ఒత్తిడికి గురవుతున్నారా..? ఈ టోల్ ఫ్రీ నెంబర్ సేవలను వినియోగించుకోండి
TGBIE Tele-MANAS Services: ఇంటర్ పరీక్షల వేళ తెలంగాణ ఇంటర్ బోర్డు మరోసారి కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవకుండా చర్యలు చేపట్టింది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా టెలీ- మానస్ సేవలను తీసుకువచ్చింది. ఇందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ (14416)ను ప్రకటించింది.
పరీక్షల వేళ విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ క్రమంలో ఒత్తిడిని భరించలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితులు నిత్యం వెలుగు చూస్తూనే ఉన్నాయి. కొందరిలో భయం ఉంటుంది.. కానీ బయటికి చెప్పుకోలేక ఇలాంటి నిర్ణయాలు తీసుకుని… అమూల్యమైన భవిష్యత్ ను పాడు చేసుకుంటారు.
విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలన్న ఆలోచనతో ‘టెలి-మానస్’ (టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండర్ నెట్‌వర్కింగ్ అక్రాస్ ది స్టేట్స్)సేవలను మరోసారి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ద్వారా విద్యార్థులకు సైకాలజిస్టులు లేదా కౌన్సిలర్లు సేవల అందుతాయి.
గతేడాది కూడా ఇదే తరహా సేవలను ఇంటర్ బోర్డు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కూడా పరీక్షల కాలం రావటంతో… మరోసారి ఈ సేవలను తీసుకువచ్చింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్ బోర్డు వివరాలను పేర్కొంది.
ఈ నెంబర్ కు కాల్ చేయండి…
ఇంటర్ పరీక్షల వేళ మానసిక ఒత్తిడికి గురయ్యే విద్యార్థులు ‘టెలి-మానస్’కు కాల్ చేసి నిపుణులతో కౌన్సిలింగ్ తీసుకోవచ్చని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఇందుకోసం వైద్యారోగ్యశాఖకు చెందిన టెలీ మానస్ సేవలను ఉచితంగా వినియోగించుకొవచ్చని సూచించింది.
విద్యార్థులు 14416 లేదా 1800914416 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించవచ్చని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య సూచించారు.ప్రతి జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో జిల్లా మెంటల్ హెల్త్ క్లినిక్‌లున్నాయని, వాటి ద్వారా కూడా సమస్యలకు పరిష్కారం పొందవచ్చని తెలిపారు. పరీక్షల వేళ విద్యార్థులు భయానికి, ఒత్తిడికి లోనవ్వొద్దని కోరారు. 24 గంటలపాటు కౌన్సిలర్లు అందుబాటులో ఉంటారని… ఈ సేవలను ఉచితంగా పొందవచ్చని వెల్లడించారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ :
- ఇంటర్ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే బోర్డు తేదీలను కూడా ఖరారు చేసింది. ఇంటర్ రెగ్యులర్, ఒకేషనల్ విద్యార్థులకు ఫిబ్రవరి 3, 2025 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.
- ఫిబ్రవరి 22, 2025తో పూర్తి అవుతాయి. రెండు సెషన్లలో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు… మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు.
- ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షలు మార్చి 5వ తేదీ నుంచి ప్రారంభమై…మార్చి 24వ తేదీతో పూర్తవుతాయి.
- ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మార్చి 6వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఎగ్జామ్స్ మార్చి 25వ తేదీతో పూర్తవుతాయి.
- విద్యార్థులు https://tgbie.cgg.gov.in/home.do వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే వీలు ఉంటుంది.
సంబంధిత కథనం