తెలంగాణ పదో తరగతి విద్యార్థుల హాల్‌టికెట్లు వచ్చేశాయ్..! విద్యార్థులు బీఎస్ఈ అధికారిక వెబ్ సైట్ నుంచి నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా కాకుండా… వారు చదివే స్కూళ్లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఏమైనా కారణాలతో పాఠశాలల యాజమాన్యాలు హాల్‌టికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
మార్చి 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్ 4వ తేదీ నాటికి అన్ని పరీక్షలు పూర్తవుతుాయి. ఈ ఏడాది 4.97 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మొత్తం 2,500 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పేపర్ లీకేజ్ వంటి వాటికి ఎలాంటి అస్కారం లేకుండా పటిష్టమైన చర్యలు చేపట్టనున్నారు.
ఇక ఇప్పటికే విద్యాశాఖ టెన్త్ వార్షిక షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మార్చి 21 నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్, 22న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 24న ఇంగ్లీష్, 26న మ్యాథ్స్ పరీక్ష జరగనుంది. మార్చి 28న ఫిజిక్స్, 29న బయోలాజికల్ సైన్స్, ఏప్రిల్ 2న సోషల్ స్టడీస్ పరీక్ష జరగనుంది.
టెన్త్ విద్యార్థులకు రెగ్యులర్ తరగతులతో పాటు నవంబరు నుంచే ఉదయం పూట ఒక గంటపాటు సబ్జెక్టుల వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వార్షిక పరీక్షల దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట పాటు ప్రత్యేక తరగతులకు ప్రణాళిక రూపొందించారు. వారం చివరన స్లిప్ టెస్టులు నిర్వహించి, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.