TG SSC Exams 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షలకు సర్వం సన్నద్ధం, 2650 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు-విద్యార్థులకు కీలక సూచనలు
TG SSC Exams 2025 : తెలంగాణ పదో తరగతి పరీక్షలకు పూర్తి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 2650 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
TG SSC Exams 2025 : తెలంగాణలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎస్ఎస్సీ-2025 వార్షిక పరీక్షలను 21.03.2025 నుంచి 04.04.2025 వరకు రాష్ట్రవ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాలలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్ష డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు.
పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు నిర్వహిస్తారు.
a. ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) సమయం ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.50 వరకు.
b. సైన్స్ సబ్జెక్టు విషయంలో రెండు భాగాలు ఉంటాయి. అంటే పార్ట్-I ఫిజికల్ సైన్స్, పార్ట్-II బయోలాజికల్ సైన్స్. వీటిని ఉదయం 9.30 నుండి ఉదయం 11.00 వరకు రెండు వేర్వేరు రోజులలో నిర్వహిస్తారు.
2650 పరీక్షా కేంద్రాలు
ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు 11,547 పాఠశాలల నుంచి మొత్తం 5,09,403 మంది (బాలురు: 2,58,895, బాలికలు: 2,50,508) విద్యార్థులు నమోదు చేసుకున్నారు. మొత్తం 2650 పరీక్షా కేంద్రాలకు 2650 చీఫ్ సూపరింటెండెంట్లు, 2650 డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్లు, 28,100 ఇన్విజిలేటర్లను నియమించారు.
రాష్ట్రంలోని సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారుల ద్వారా పాఠశాలలకు హాల్ టిక్కెట్లను ఇప్పటికే పంపారు. అభ్యర్థులు తమ హాల్ టిక్కెట్లను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి నుంచి పొందవచ్చు. లేదా హాల్ టిక్కెట్లను www.bse.telangana.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుని పరీక్షలకు హాజరు కావచ్చు.
హైదరాబాద్‌లోని తెలంగాణ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కార్యాలయంలో (ఫోన్ నంబర్: 040-23230942), అన్ని జిల్లా విద్యా కార్యాలయాలలో ఏవైనా ఫిర్యాదులు ఉంటే వెంటనే పరిష్కరించడానికి 24/7 కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి అన్ని పరీక్షా కేంద్రాలలో ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులను ఉదయం 09.35 గంటల వరకు (అంటే 5 నిమిషాల గ్రేస్ పీరియడ్) పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. వాతావరణం, ట్రాఫిక్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులు ఉదయం 08.30 గంటలలోపు పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవాలి.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్
అభ్యర్థులు పరీక్ష ప్రారంభానికి కనీసం ఒకటి లేదా రెండు రోజుల ముందు పరీక్షా కేంద్రాన్ని సందర్శించాలి. తద్వారా పరీక్ష రోజున పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవచ్చు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి తెలంగాణ హైదరాబాద్‌లోని పాఠశాల విద్య డైరెక్టర్, సీనియర్ అధికారులను జిల్లా స్థాయి పరిశీలకులుగా నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాలలో తగినంత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఎగ్జామ్ జరిగే సమయంలో జిరాక్స్ కేంద్రాలు మూసివేస్తారు. పరీక్షల పర్యవేక్షణను అరికట్టడానికి 144 ఫ్లయింగ్, స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేస్తారు. సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారులు సమస్యాత్మక కేంద్రాలలో సిట్టింగ్ స్క్వాడ్‌లను కూడా ఏర్పాటు చేస్తారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ప్రతి పరీక్షా కేంద్రంలోని చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లో CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు.
ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ నిషేధం
- పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను నిషేధించారు.
- పరీక్షా రాసే విద్యార్థులు, సిబ్బంది పరీక్షా కేంద్రాలకు సెల్ ఫోన్ లు తీసుకెళ్లడం నిషేధం
- విధుల్లో పాల్గొనే సిబ్బంది తప్పనిసరిగా ఫొటో గుర్తింపు కార్డులు ధరించాలి. బయటి వ్యక్తులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించడానికి అనుమతి లేదు.
- అభ్యర్థులు తమతో పాటు ఈ క్రింది వస్తువులను పరీక్షా హాలులోకి తీసుకెళ్లడానికి అనుమతిస్తారు.
a. హాల్ టికెట్
b. పరీక్ష ప్యాడ్
c. పెన్, పెన్సిల్, స్కేల్, షార్పెనర్, ఎరేజర్, జామెట్రిక్ పరికరాలు
- అభ్యర్థుల ఓఎంఆర్ వివరాలను ముందుగా ధ్రువీకరించాలి.
- ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే విద్యార్థులు ప్రశ్నపత్రంలోని పార్ట్-ఎలోని ప్రతి పేజీలో వారి హాల్ టికెట్ నెంబర్ రాయాలి.
- ఆన్సర్ బుక్ లెట్ పై అభ్యర్థి తన హాల్ టికెట్ నంబర్ లేదా పేరును రాయకూడదు. తన సంతకం లేదా ఏదైనా గుర్తును సమాధాన బుక్‌లెట్, పార్ట్-బి (బిట్ పేపర్), గ్రాఫ్, మ్యాప్‌లోని ఏ భాగంలోనైనా రాయకూడదు.
- అభ్యర్థులు OMR షీట్‌లోని సమాధాన బుక్‌లెట్ సీరియల్ నంబర్‌ను సూచించిన పెట్టె, పార్ట్-బి (బిట్ పేపర్), గ్రాఫ్ మరియు మ్యాప్‌లో వ్రాయాలి.
- పరీక్ష సమయంలో ఎవరైనా అభ్యర్థి కాపీయింగ్/మాస్ కాపీయింగ్‌లో దొరికితే వారిని డిబార్ చేస్తారు. తదుపరి పరీక్షలకు అనుమతించరు.
- పరీక్షా విధుల్లో పాల్గొన్న ఎవరైనా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్
- చట్టం నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటారు.
- సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి, తహశీల్దార్, మండల విద్యాశాఖాధికారి ఫోన్ నంబర్లను పరీక్షా కేంద్రంలోని ప్రదేశాలలో ప్రదర్శించాలి.
సంబంధిత కథనం