తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ (2025-26) విద్యా సంవత్సరానికి మొత్తం 20, 258 అప్లికేషన్లు అందాయి.
జూన్ 21వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు… మెరిట్ లిస్ట్ పై కసరత్తు చేపట్టారు.ఈ ప్రక్రియ పూర్తి కావటంతో… ఇవాళ మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. లిస్ట్ లో పేరున్న విద్యార్థులకు… ఐఐఐటీ క్యాంపస్ లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.
రాష్ట్రంలో బాసర కేంద్రంగా ఐఐఐటీ క్యాంపస్ ఉండేది. అయితే ఈ విద్యా సంవత్సరం మహబూబ్ నగర్ లోనూ ప్రారంభించారు. ఈ రెండింటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. జూలై 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉండనుంది.
పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.ఈ ఏడాది బాసరలోని 1500 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్ లోనూ ఐఐఐటీ క్యాంపస్ ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచే ప్రవేశాలను ఖరారు చేశారు. ఇక్కడ 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది. తాజాగా మార్కుల విధానం అమలు చేస్తుండటంతో… ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ అధికారులు విడుదల చేసే మెరిట్ జాబితాను https://www.rgukt.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెరిట్ జాబితాలో పేర్లన్న విద్యార్థులకు… జూలై 7వ తేదీ నుంచి కౌన్సెలింగ్ షురూ అవుతుంది.
గతేడాది వరకు తెలంగాణ టెన్త్ ఫలితాలను గ్రేడింగ్ విధానంలో ప్రకటించారు. పాత పద్ధతికి స్వస్తి పలికిన తెలంగాణ సర్కార్… ఈ ఏడాది మార్కులను ప్రకటించింది. పాత పద్ధతిలోనే మార్కులను ప్రకటించే విధానాన్ని పునఃప్రారంభించింది. ఫలితంగా గ్రేడ్స్ కాకుండా… మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ఐఐఐటీ క్యాంపస్లలో ప్రవేశాలను కల్పించనున్నారు.
గ్రామీణ విద్యార్ధులను సాంకేతిక విద్యా రంగంలో ముందు నిలిపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటుంది. కేవలం మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు. అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు, సబ్జెక్టులలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులను వరుసగా పరిగణిస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే, వయస్సును పరిగణనలోకి తీసుకొని పెద్దవారికి సీట్లు కేటాయిస్తారు.