విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్, ముఖ్య తేదీలివే-telangana polycet 2025 counselling begins from today key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్, ముఖ్య తేదీలివే

విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్, ముఖ్య తేదీలివే

ఇవాళ్టి నుంచి టీజీ పాలిసెట్‌ - 2025 కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు. జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ 2025

తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సాంకేతి విద్యాశాఖ షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… నేటి నుంచి జూన్ 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు….

పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా…. ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. మొత్తం 2 విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

జూన్ 26 నుంచి జూన్ 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇక జూలై 1వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవాలి. జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లేదా సాంకేతిక విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.

పాలిటెక్నిక్‌లో 100 శాతం సీట్లను కన్వీనర్‌ కోటా కిందే భర్తీ చేస్తారు. వాటిల్లో అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్‌ బ్రాంచీలో 6,703 సీట్లు ఉన్నాయి. ఇక ఈఈఈలో 5,850, ఈసీఈలో 5,783, మెకానికల్‌లో 4,008, సివిల్‌లో 3,929 సీట్లున్నట్లు అధికారులు ప్రకటించారు.

జూలై 9 తుది కౌన్సెలింగ్:

పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 9 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 11వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జూలై 11వ తేదీ నుంచి 12 వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. జూలై 15వ తేదీన అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 18వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.

ఈ ఏడాది జరిగిన పాలిసెట్ పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని… సీట్లు పొందాల్సి ఉంటుంది. ఈసారి కొత్తగా మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.ఈసారి మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.