రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో రెండో విడత ప్రవేశాలపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో చేరవచ్చని తెలిపింది.
ఈ విద్యా సంవత్సరానికి సంంబధించిన తొలి విడత ప్రవేశాలు మే 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో రెండో విడత ప్రవేశాలకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు…జూలై 31వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాత ప్రవేశాలకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.
రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) తరగతులు జూన్ 2, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే తాజాగానే తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు.
మరోవైపు ఇంటర్మీడియట్ బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను కూడా బోర్డు అధికారిక వెబ్ సైట్ టీఎస్‌బీఐఈ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటున్నారు. ఇక విద్యార్థుల ఆధార్ నెంబర్ తప్పకుండా నమోదు చేయటంతో పాటు... అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాల్సి ఉంటుంది.