తెలంగాణ హైకోర్టులోని వివిధ విభాగాల్లో 1,673 పోస్టులను భర్తీ చేయడానికి నియామక ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 8న ప్రారంభమవుతుంది. ఆసక్తిగల అభ్యర్థులు జనవరి 31 వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. ఖాళీలను పలు విభాగాలుగా విభజించారు,
1,277 నాన్-టెక్నికల్ పోస్టులు, 184 టెక్నికల్ పోస్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్, సబార్డినేట్ సర్వీస్‌లోని 212 పోస్టులు ఉన్నాయి. వీటిల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, అసిస్టెంట్లు, కోర్ట్ మాస్టర్లు, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, కాపీయిస్టులు వంటి క్లరికల్ పోస్టులు ఉన్నాయి.
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి సరళమైన ప్రక్రియను అందుబాటులోకి తీసుకొచ్చారు. ముందుగా అభ్యర్థులు tshc.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. సైట్‌లోకి ప్రవేశించిన తర్వాత.. వారు రిక్రూట్‌మెంట్ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి. అవసరమైన వివరాలను సమర్పించాలి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి.
దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేసిన తర్వాత.. సమర్పించే ముందు అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. భవిష్యత్తు అవసరాల కోసం సమర్పించిన ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. జనవరి 8న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జనవరి 31న దరఖాస్తుల సమర్పణకు గడువు ముగుస్తుంది.
వీటికి సంబంధించిన పరీక్షలు 2025 ఏప్రిల్‌లో జరిగే అవకాశం ఉంది. దరఖాస్తుదారుల వయస్సు 18 - 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హత, ితర సూచనలను క్షుణ్నంగా పరిశీలించాలని అధికారులు సూచించారు.
ఎంపికైన అభ్యర్థులకు వారి స్థాయినిబట్టి నెలకు రూ. 19,000 నుండి రూ. 1,33,630 వరకు పోటీ జీతం ఇస్తారు. ముందస్తు నోటీసు లేకుండా ఎప్పుడైనా ఖాళీల సంఖ్యను సవరించే లేదా నోటిఫికేషన్‌ను రద్దు చేసే హక్కు హైకోర్టుకు ఉందని ఈ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు. కాబట్టి, ఈ నియామక ప్రక్రియకు సంబంధించి ఏవైనా అప్‌డేట్ లేదా మార్పులకు సంబంధించిన సమాచారం కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరుచూ పరిశీలించాలి.