TG Job Notification 2025 : పుస్తకాలు వదలొద్దు.. ఇక కొలువుల జాతరే.. వరుస నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు!-telangana government to recruit thousands of posts in various departments ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Tg Job Notification 2025 : పుస్తకాలు వదలొద్దు.. ఇక కొలువుల జాతరే.. వరుస నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు!

TG Job Notification 2025 : పుస్తకాలు వదలొద్దు.. ఇక కొలువుల జాతరే.. వరుస నోటిఫికేషన్ల జారీకి ఏర్పాట్లు!

TG Job Notification 2025 : తెలంగాణలో గత 7 నెలలుగా ఉద్యోగ నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఎస్సీ వర్గీకరణ చట్టం కోసం ప్రభుత్వం ఆపేసింది. ఇప్పుడు క్లియర్​ కావడంతో.. జాబ్​ క్యాలెండర్​ రీషెడ్యూల్​ చేయాలని సర్కారు నిర్ణయించింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో వేలల్లో పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు (istockphoto)

తెలంగాణలో కొన్ని నెలలుగా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు నిలిచిపోయాయి. ఇకనుంచి మాత్రం నోటిఫికేషన్లు ఒక్కొక్కటిగా విడుదల కానున్నాయి. ఎస్సీ వర్గీకరణ చట్టం రావడంతో.. జాబ్​ క్యాలెండర్​ను ప్రభుత్వం రీషెడ్యూల్​ చేయాలని నిర్ణయించింది. దీంతో గ్రూప్​ 1,2,3,4 పోస్టులతోపాటు.. పోలీస్, గురుకుల రిక్రూట్‌మెంట్ బోర్డుల నుంచి నోటిఫికేషన్‌లు వెలువడనున్నాయి.

మంత్రులు సమావేశమై..

ఎప్పుడు ఏ పరీక్షలు నిర్వహించాలనే దానిపై త్వరలోనే ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది. ఇందుకోసం మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 2024–25 కోసం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌లో మొత్తం 20 నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే.. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు ఫస్ట్ నాటి తీర్పు తర్వాత ఎస్సీ ఉప వర్గీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త జాబ్ నోటిఫికేషన్లను నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందుకే 2024 ఆగస్టు నుంచి కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు.

జాబ్ క్యాలండర్ ప్రకారం..

ప్రభుత్వ జాబ్ క్యాలండర్ ప్రకారం.. 2024 సెప్టెంబర్​ నుంచి షెడ్యూల్ చేసిన నోటిఫికేషన్‌లు అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని జాగ్రత్తగా రీ షెడ్యూల్ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రతి పరీక్ష నిర్వహణకు.. అటు ఆలిండియాతో పాటు ఇతర పరీక్షలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని షెడ్యూల్​ చేయాల్సి ఉంటుంది. మరోవైపు ఈ ఏడాదిలో కొన్ని శాఖల్లో పదవీ విరమణలు పెరిగాయి. దీంతో మరోసారి ఖాళీల సంఖ్యను తీసుకుని ఆప్​డేటెడ్​గా నోటిఫికేషన్లు విడుదల చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.

నెలాఖరులోగా..

మహిళా శిశు సంక్షేమ శాఖలో 14 వేల 236 అంగన్వాడీ, ఆరోగ్య శాఖలో 4 వేలకు పైగా పోస్టులకు నోటిఫికేషన్లను ఈ నెలఖారులోగా విడుదల చేయాలని ప్రభుత్వం ప్లాన్​ చేస్తోంది. అటు ఆర్టీసీలోనూ 3 వేల పోస్టులకు పైగా భర్తీకి ప్రభుత్వ అనుమతి ఇచ్చింది. మిగిలిన శాఖల నుంచి ఖాళీలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. జాబ్​క్యాలెండర్​ ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్​లో పోలీసు రిక్రూట్​మెంట్, మే నెలలో గ్రూప్–2 సర్వీసెస్‌కు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. గ్రూప్​ 3 నోటిఫికేషన్​ కూడా జులైలో రావాల్సి ఉన్నది.

రోస్టర్ ఫిక్స్ చేసి..

ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్‌ను షెడ్యూల్​ చేయగా.. ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో నిలిపేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి కాలరీస్​, ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్లు కూడా నిలిచిపోయాయి. వీటన్నింటిపై ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి.. జాబ్​ క్యాలెండర్​ను రీషెడ్యూల్ చేయనుంది. ఎస్సీ వర్గీకరణ ప్రకారం.. రోస్టర్​ ఫిక్స్​ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనుందని తెలుస్తోంది. మొత్తానికి ఈ ఏడాది భారీగా ఉద్యోగ నియామకాలు జరిగే అవకాశం ఉంది.

 

Basani Shiva Kumar

TwittereMail
బాసాని శివకుమార్ హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు. గతంలో ఈనాడు, ఈటీవీ భారత్, టీవీ9 తెలుగు, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయంలో పని చేశారు. 2025లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం