తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక మార్పులు రానున్నాయి. 2025-26 విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నర్సరీ, లోయర్ కిండర్ గార్టెన్, అప్పర్ కిండర్ గార్టెన్ వంటి ప్రీ ప్రైమరీ కోర్సులను ప్రవేశపెట్టాలని కసరత్తు చేస్తోంది.
గురువారం హైదరాబాద్ లోని మంచిరేవులలో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్య ప్రారంభానికి ముందే ప్రీ ప్రైమరీ తరగతులు ఉండాలని.. ఆ దిశగా సర్కార్ కసరత్తు చేస్తోందని చెప్పారు.
రాష్ట్ర విద్యా వ్యవస్థలో విధానపరమైన లోపాలను పరిష్కరించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలోని విద్యా కమిషన్ ఇటీవల ఈ ప్రతిపాదనను సిఫారసు చేసిందని పాఠశాల విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు గురువారం పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నరసింహారెడ్డితో సహా ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి సమావేశంలోనూ ఈ ప్రతిపాదనపై చర్చించారు.
ఇక ఈ విధానాన్ని తొందరపడి అమలు చేయబోమని విద్యాశాఖకు చెందిన సీనియర్ అధికారి స్పష్టం చేశారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని 594 మండలాల్లో (రెవెన్యూ బ్లాకులు) ఒకటి లేదా రెండు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విభాగాలను ప్రవేశపెట్టే ఆలోచన చేస్తున్నామని చెప్పారు. స్పందన బాగుంటే రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థను అమలు చేస్తే అవకాశం ఉంటుందని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి నమూనాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై కూడా ప్రభుత్వం అధ్యయనం చేస్తుందని ఆ అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం… 2022లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ సెక్షన్లను ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. కానీ వాటిని ప్రస్తుతం ఉన్న అంగన్ వాడీ కేంద్రాలకు అప్పగించిందని చెప్పారు.
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభోత్సవం సందర్భంగా విద్యా వ్యవస్థపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రాథమిక విద్యావిధానంలో అస్పష్టత నెలకొందని…ఈ నేపథ్యంలోనే ప్రీ స్కూల్ కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని చెప్పారు. ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల మధ్య వ్యత్యాసాన్ని తొలగించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రంలోని 11,500 ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 30 లక్షలు కాగా…. 29 వేల ప్రభుత్వ పాఠశాలల్లో కేవలం 18.5 లక్షల మంది మాత్రమే ఉన్నారన్నారని గుర్తు చేశారు.
ప్రభుత్వ పాఠశాలలు ఐదేళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలను మాత్రమే చేర్చుకుంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కానీ ప్రైవేటు సంస్థలు నర్సరీతో ప్రారంభించి నిరంతర ప్రీ స్కూల్ వ్యవస్థను అందిస్తున్నాయని గుర్తు చేశారు. ఫలితంగా చాలా మంది తల్లిదండ్రులు…. ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతున్నారన్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు తక్కువగా ఉంటుందని వివరించారు.
ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోని ఉపాధ్యాయుల విద్యార్హతలు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్ని అర్హతలు కలిగిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నప్పటికీ… విద్యార్థులను ఎందుకు ఆకర్షించలేకపోతున్నారో అర్థం చేసుకోవడానికే ప్రభుత్వం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిందని వ్యాఖ్యానించారు.