తెలంగాణలోని డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి కాగా… ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించిన గడువు కూడా దగ్గరపడింది. అర్హులైన విద్యార్థులు… జూన్ 8వ తేదీ నాటికి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరోవైపు దోస్త్ సెకంజ్ ఫేజ్ కు సంబంధించి వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే వెబ్ ఆప్షన్లకు అవకాశం ఉంటుంది. ఈ గడువు జూన్ 9వ తేదీతో పూర్తవుతుంది.
దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జూన్ 13వ తేదీన ఉంటుంది. ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు.. జూన్ 13వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చు. ఈ గడువు జూన్ 18వ తేదీతో పూర్తవుతుంది. కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే… సీటు రద్దవుతుంది.
తెలంగాణ దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్ 13 నుంచి ఉంటుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఉన్నత విద్యామండలి నిర్ణయించిన మూడు విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీట్లు ఖాళీగా ఉంటేనే ఇందుకు అవకాశం ఉంటుంది.