తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలకు దోస్త్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆన్ లైన్ ద్వారా డిగ్రీ మొదటి సంవత్సరానికి సంబంధించిన సీట్లను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంంబధించిన వివరాలను ఉన్నత విద్యామండలి వెల్లడించింది. మొత్తం మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియను పూర్తి చేయనుంది.
ఫస్ట్ ఫేజ్ లో భాగంగా మే 3వ తేదీ నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. రూ. 200 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు మే 21వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. మే 10వ తేదీ నుంచి 22 వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మే 29న మొదటి ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఇక రెండో విడత కింద మే 30 నుంచి జూన్ 8 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. జూన్ 13న సీట్ల కేటాయింపు ఉంటుందని విద్యా మండలి ప్రకటించింది. మూడో విడత ప్రక్రియ జూన్ 13 నుంచి షురూ అవుతుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. జూన్ 13 నుంచి 19 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూన్ 23న సీట్ల కేటాయింపు ఉంటుంది.
ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు మే 30వ తేదీ నుంచి జూన్ 6లోపు సీటు పొందిన కాలేజీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. రెండో, మూడో విడతలో కూడా సీట్లు పొందే విద్యార్థులు ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అలా చేయకపోతే సీటు రద్దు అవుతుంది. ఫస్ట్ సెమిస్టర్ తరగతులు జూన్ 30వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి.
ఇంటర్ పూర్తి అయిన విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం కోసం దోస్త్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలేజీలను ఎంచుకోవాలి. వారి స్కోర్, రిజర్వేషన్ ఆధారంగా…. సీట్లను కేటాయిస్తారు. dost.cgg.gov.in/welcome.do వెబ్ సైట్ లోకి వెళ్లి విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
దోస్త్ రిజిస్ట్రేషన్ల ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, పాలమూరు, మహాత్మగాంధీ, తెలంగాణ వర్శిటీ,చాకలి ఐలమ్మ, శాతవాహన వర్శిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలను కల్పిస్తారు.
గతేడాది డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేశారు. మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ అవకాశం కూడా కల్పించారు. ఈసారి కూడా మొత్తం 3 విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. సీట్లు మిగిలితే స్పెషల్ ఫేజ్ నోటిఫికేషన్లు వస్తాయి. వీటిపై ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంటుంది.
దోస్త్ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా డిగ్రీ అడ్మిషన్ల అప్డేట్స్ తెలుసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ల ఫీజుతో పాటు వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, అలాట్ మెంట్ కాపీలు పొందటం వంటి ప్రక్రియలను పూర్తి చేసుకోవచ్చు.