తెలంగాణలోని మహాత్మ పూలే బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల ఫలితాలు విడుదలయ్యాయి. అర్హులైన విద్యార్థుల జాబితాను అధికారులు ప్రకటించారు. ఎలాంటి అర్హత పరీక్ష లేకుండా… కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఈ ఫలితాలను ప్రకటించారు. ఇందుకు సంబంధించిన జాబితాను https://mjpabcwreis.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.
అర్హత పొందిన విద్యార్థులకు 2025- 26 విద్యా సంవత్సరానికి గానూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 130 జూనియర్ కాలేజీల్లో బాలురకు 11,360 సీట్లు, 127 జూనియర్ కాలేజీల్లో బాలికలకు 10,720 సీట్లు అందుబాటులో ఉండగా…. మొత్తం 22, 080 మందిని ఎంపిక చేసినట్టు అధికారులు తెలిపారు.
కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా సీట్ల కేటాయింపు చేశారు. మెరిట్ తో పాటు రిజర్వేషన్లను ప్రమాణికంగా తీసుకుని ఎంపిక చేశారు. వీటి ఆధారంగా ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ, హెచ్ ఈసీతో పాటు వొకేషనల్ కోర్సుల్లో కూడా సీట్లను భర్తీ చేశారు. సీట్లు పొందిన విద్యార్థులకు నీట్, ఎంసెట్, ఐఐటీ, సీఏ, సీపీటీ లేదా క్లాట్ కోచింగ్ కూడా ఇస్తారు. అంతేకాకుండా విద్యార్థులకు హాస్టల్ సదుపాయం ఉంటుంది. ఆధునాతమైన ల్యాబ్స్ తో పాటు సరైన వసతులు కల్పిస్తారు.
మెరిట్ ఆధారంగా సీట్లు పొందిన విద్యార్థులు అడ్మిషన్ సమయంలో ముఖ్యమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో టీసీ, పదో తరగతి మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయపు ధ్రువీకరణపత్రం, ఫిజికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్, పాస్ పోర్టు సైజ్ ఫొటోలు, మూడు సెట్ల జిరాక్స్ కాపీలను అందజేయాలి.
సంబంధిత కథనం