Neet PG: పీజీ మెడికల్ అడ్మిషన్లలో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Neet PG: పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వైద్య కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లు ఆమోదయోగ్యం కాదని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను అవి ఉల్లంఘిస్తాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వైద్య కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని తీర్పునిచ్చింది.
Neet PG admissions: పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) వైద్య కోర్సుల్లో నివాస ప్రాంతం ప్రాతిపదికన రిజర్వేషన్లు (domicile-based reservations) కల్పించడం ఆమోదయోగ్యం కాదని, అలా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.

నీట్ పీజీ అడ్మిషన్లు..
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) పరీక్షలో మెరిట్ ఆధారంగా రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిల త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాష్ట్ర కోటాలో పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నివాస ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగపరంగా ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పీజీ మెడికల్ కోర్సుల్లో నివాస ఆధారిత రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమేనని పేర్కొంది.
అంతా భారతదేశమే..
‘‘మనమంతా భారత భూభాగంలో నివసిస్తున్నాం. ప్రాంతీయ, రాష్ట్ర నివాసం అంటూ ఏదీ లేదు. ఒకే ఒక నివాసం ఉంది. మనమంతా భారత దేశ పౌరులం. భారతదేశంలో ఎక్కడైనా నివాసాన్ని ఎంచుకునే హక్కు, దేశంలో ఎక్కడైనా వ్యాపారం, వృత్తిని చేపట్టే హక్కు మనకు ఉంది. భారతదేశం అంతటా ఉన్న విద్యా సంస్థల్లో ప్రవేశాన్ని ఎంచుకునే హక్కును కూడా రాజ్యాంగం మనకు ఇచ్చింది" అని తీర్పును వెలువరిస్తూ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.
భవిష్యత్ అడ్మిషన్లకు మాత్రమే..
భవిష్యత్ అడ్మిషన్ల కోసం నివాస రిజర్వేషన్ల (domicile-based reservations) ను కొట్టివేస్తూ, ఈ తీర్పు విద్యార్థులకు ఇప్పటికే మంజూరు చేసిన నివాస రిజర్వేషన్లను ప్రభావితం చేయదని సుప్రీంకోర్టు (supreme court) స్పష్టం చేసింది. నీట్ (NEET) పీజీ మెడికల్ అడ్మిషన్లలో నివాస రిజర్వేషన్లు (reservations) రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై కొందరు విద్యార్థులు దాఖలు చేసిన అప్పీళ్లపై ఈ తీర్పు వెలువడింది.