CBI PGDBF: బ్యాంకింగ్ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమాతో ప్రభుత్వ బ్యాంక్‌లో ఉద్యోగం, సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్‌ విడుదల-secure a government bank job with a pg diploma in banking finance ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Cbi Pgdbf: బ్యాంకింగ్ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమాతో ప్రభుత్వ బ్యాంక్‌లో ఉద్యోగం, సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్‌ విడుదల

CBI PGDBF: బ్యాంకింగ్ ఫైనాన్స్‌లో పీజీ డిప్లొమాతో ప్రభుత్వ బ్యాంక్‌లో ఉద్యోగం, సెంట్రల్ బ్యాంక్ నోటిఫికేషన్‌ విడుదల

Bolleddu Sarath Chandra HT Telugu
Feb 03, 2025 07:30 AM IST

CBI PGDBF: బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం సన్నద్ధం అవుతున్న అభ‌్యర్థులకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంకులో పోస్ట్ గ్రాడ్యుయేట్‌ డిప్లొమాతో పాటు స్కేల్‌ 1 ఆఫీసర్ ఉద్యోగాన్ని కల్పించే పీజీడీబీఎఫ్‌ నోటిఫికేషన్ విడుదల చేసింది.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీజీడీబీఎఫ్‌ కోర్సుకు నోటిఫికేషన్
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీజీడీబీఎఫ్‌ కోర్సుకు నోటిఫికేషన్

CBI PGDBF: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. పీజీ డిప్లొమాతో పాటు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. డిగ్రీ విద్యార్హతతో ఈ కోర్సుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్ష, ఇంటర్వ్యూలతో కోర్సుకు ఎంపిక చేస్తారు. ఈ కోర్సులో శిక్షణతో కూడిన ఉపాధి లభిస్తుంది. సాధారణ బ్యాంకింగ్ నియామకాలకు భిన్నంగా భిన్నంగా శిక్షణతో కూడిన ఉద్యోగం లభిస్తుంది. ఈ కోర్సులో దేశవ్యాప్తంగా వెయ్యి ఖాళీలున్నాయి. కోర్సు పూర్తి చేసిన వారు జూనియర్ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్ స్కేల్-1 క్రెడిట్ ఆఫీసర్ హోదాతో ఉద్యోగం లభిస్తుంది. శిక్షణ పూర్తయ్యాక నెలకు రూ.70 వేలకుపైగా వేతనం లభిస్తుంది.

ప్రభుత్వ రంగ బ్యాంకులు తమ అవసరాలకు అనుగుణంగా బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ నియామకాలు చేపడుతున్నాయి. ఈ కోర్సులు విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఆ బ్యాంకుల్లోనే ఉద్యోగాలు చేసే అవకాశం కల్పిస్తారు. మొదట్లో బ్యాంకింగ్ ఫైనాన్స్ కోర్సులకు అయా బ్యాంకులు రుణ సదుపాయం కల్పించేవి. కోర్సు ఫీజు లక్షల్లో ఉండటంతో అభ్యర్థులు వెనుకంజ వేసే వారు. అయితే కోర్సులు చేయడానికి బ్యాంకులు రుణం ఇచ్చి తర్వాత అభ్యర్థులు నుంచి తిరిగి వసూలు చేసుకునేవి. దీంతో పీజీడీబీఎఫ్‌ కోర్సులకు గణనీయంగా డిమాండ్ పెరిగింది. ఈ కోర్సులతో ఉన్నత విద్యతో పాటు ఉద్యోగం కూడా లభిస్తుంది. పీజీ డిప్లొమా తర్వాత ఆసక్తి మేరకు ఎంబిఏ కూడా పూర్తి చేసుకునే అవకాశం లభిస్తుంది.

రాత పరీక్షలో అర్హత సాధించినవారి జాబితా నుంచి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా ఇంటర్వ్యూలకి ఎంపిక చేస్తారు. ఒక్కో పోస్టుకు ఎందరిని ఇంటర్వ్యూకు పిలవాలనే దానిని పరీక్షకు హాజరైన వారి సంఖ్య ఆధారంగా నిర్ణయిస్తారు. ఇంటర్వ్యూ 50 మార్కులకు నిర్వహిస్తారు. ఇందులో జనరల్ అభ్యర్థులకు కనీసం 25 మార్కులు పొందడం తప్పనిసరి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు 45 శాతం 22.5 మార్కులు రావాలి. ఇంటర్వ్యూలో అర్హత మార్కులు పొందినవారి జాబితాకు ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులు కలుపుతారు. కేటగిరీల వారీగా మెరిట్ జాబితా రూపొందించి, కోర్సులోకి తీసుకుంటారు.

పీజీడీబీఎఫ్‌ కోర్సు నిర్వహణ ఇలా…

పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు వ్యవధి ఏడాది ఉంటుంది. ఇందులో 9 నెలలు తరగతి గది శిక్షణ ఉంటుంది, 3 నెలల పాటు బ్యాంకులో జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. చదువు, వసతి, భోజనం అన్నీ కలిపి మొత్తం ఫీజు రూ.3 నుంచి 4 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఫీజుకు దీనికి జీఎస్టీ అదనంగా చెల్లించాలి. అవసరమైన వారికి సెంట్రల్ బ్యాంకు రుణం మంజూరు చేస్తుంది. విధుల్లో చేరిన తర్వాత నెలసరి వాయిదాల్లో చెల్లించుకోవచ్చు. సెంట్రల్‌ బ్యాంకులో ఐదేళ్లు ఉద్యోగంలో కొనసాగితే కోర్సు ఫీజు మొత్తాన్ని వెనక్కి ఇచ్చేస్తారు. ఐదేళ్ల లోపు ఉద్యోగం నుంచి వైదొలిగితే మొత్తం కోర్సు ఫీజు చెల్లించాలి. రుణం తీసుకున్నవారైతే ఫీజుతో పాటు మొత్తం వడ్డీని కూడా కట్టాలి. ఉద్యోగార్థులకు చదువుతో పాటు ఉద్యోగం లభించే అద్భుతమైన అవకాశం సీబీఐ కల్పిస్తోంది.

శిక్షణలో స్టైపెండ్- వేతనం ఇలా

కోర్సులో చేరిన వారికి వివిధ ప్రాంతీయ కేంద్రాల్లో శిక్షణ అందిస్తారు. ఆ సమయంలో వారికి ప్రతి నెలా రూ.2500 చొప్పున మొదటి 9 నెలలు స్టైఫెండ్‌ చెల్లిస్తారు. ఆ తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.10,000 చొప్పున 3 నెలలు చెల్లిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ అందిస్తారు. ఆ తర్వాత వారికి జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-1లో ఆఫీసర్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే రూ.48,480 బేసిక్‌తో జీతం లభిస్తుంది. ఇతర అలవెన్సులతో కలిపి ప్రతి నెల రూ.70,000 వేతనం లభిస్తుంది.

ఆన్లైన్‌లో పరీక్ష నిర్వహణ..

పీజీడీబీఎఫ్ కోర్సులో ప్రవేశానికి.. ఆన్లైన్లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు నిర్వహిస్తారు. అందులో అర్హత సాధించిన వారికి ఇంటర్వ్యూ ఉంటుంది. మొత్తం మార్కులతో మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు జరుగుతాయి. ఐబీపీఎస్, ఎస్బీఐ పీవో, పీజీ డిప్లొమా ఎంట్రీ పాత ప్రశ్నపత్రాలతో ప్రాక్టీస్ చేస్తే పీజీడీబీఎఫ్‌ కోర్సును అధిగమించడం సులువుగా ఉంటుంది.

ఆన్లైన్‌ పరీక్షను 120 ప్రశ్నలకు 90 నిమిషాలు వ్యవధి ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ 45 సెకన్ల వ్యవధి ఉంటుంది. అన్ని విభాగాల్లో కటాఫ్‌ మార్కులు రావాల్సి ఉంటుంది. రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఆర్బీఐ, బ్యాంక్ పదజాలం, బీమా, రెపో, రివర్స్ రెపో, వడ్డీరేట్లు, బ్యాంకుల కార్యకలాపాలు, బ్యాంకుల విలీనం, తాజా ఆర్థిక నిర్ణయాలు, బ్యాంకులు ప్రధాన కార్యాలయాలు-అధిపతులు వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అవేర్‌నెస్‌లో వర్తమాన వ్యవహారాలు ప్రశ్నలుగా వస్తాయి. దేశ చరిత్ర, సంస్కృతి. భూగోళం పాలిటీ, సైనో పాథమిక అవగాహననూ పరిశీలిస్తారు.

ఖాళీలు రిజర్వేషన్లు…

సీబీఐ పీజీడీబీఎఫ్‌లో మొత్తం 1000 ఖాళీలు ఉన్నాయి. విభాగాల వారీగా జనరల్‌లో 405, ఓబీసీ 270, ఎస్సీ 150, ఎస్టీ 75, ఈడబ్ల్యుఎస్ 100 ఉంటాయి.

విద్యార్హత: నవంబరు 30, 2024 నాటికి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగులకు 55 శాతం మార్కులు సరిపోతాయి.

నవంబరు 30, 2024 నాటికి 20 - 30 ఏళ్ల లోపు ఉండాలి. నవంబరు 30, 1994 నవంబరు 30, 2004 మధ్య జన్మించినవారు అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.

పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం ఉంటాయి.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.150. మిగిలిన అందరికీ రూ.750.

ఆన్లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 20లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింకును అనుసరించండి. https://centralbankofindia.co.in/sites/default/files/01-PGDBF-Notification.pdf

సెంట్రల్ బ్యాంక్ పీజీడీబీఎఫ్‌ కోర్సుకు దరఖాస్తు చేయడానికి ఈ లింకును అనుసరించండి.

Whats_app_banner