ఎస్బీఐలో పీఓ పోస్టులకు దరఖాస్తులు మెుదలు.. ఎన్ని ఖాళీలు, ఎంత జీతం వస్తుంది?-sbi po recruitment 2025 online application process starts from today know eligibility and other details state bank jobs ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఎస్బీఐలో పీఓ పోస్టులకు దరఖాస్తులు మెుదలు.. ఎన్ని ఖాళీలు, ఎంత జీతం వస్తుంది?

ఎస్బీఐలో పీఓ పోస్టులకు దరఖాస్తులు మెుదలు.. ఎన్ని ఖాళీలు, ఎంత జీతం వస్తుంది?

Anand Sai HT Telugu

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తిగల అభ్యర్థులు ibpsonline.ibps.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎస్బీఐ పీఓ రిక్రూట్‌మెంట్

బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే యువతకు గుడ్ న్యూస్. ఐబీపీఎస్ అధికారిక వెబ్‌సైట్ ibpsonline.ibps.inలో ఎస్బీఐ పీఓ పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేయాలనుకుంటే వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేయవచ్చు.

పోస్టుల వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రొబేషనరీ ఆఫీసర్(SBI PO) పోస్టులకు జూన్ 24 నుంచి అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులను ibpsonline.ibps.inలో జూలై 14 వరకు స్వీకరిస్తోంది. ఎస్బీఐ ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. మెుత్తం 541 పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. వీటిలో 203 పోస్టులు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఉన్నాయి. 135 పోస్టులు ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ) కోసం, 50 పోస్టులు ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోసం, 37 పోస్టులు షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ) కోసం, 75 పోస్టులు షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ) కేటగిరీ అభ్యర్థులకు రిజర్వ్ చేశారు. వీటితో పాటు బ్యాక్‌లాగ్ నియామకాల కింద కొన్ని పోస్టులను కూడా భర్తీ చేస్తారు.

అర్హతలు

ఈ పోస్టుల కోసం ఏదైనా విశ్వవిద్యాలయ కళాశాల లేదా కేంద్ర ప్రభుత్వంతో గుర్తింపు పొందిన సంస్థ నుండి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి. చివరి సంవత్సరం / చివరి సెమిస్టర్ అభ్యర్థులు కూడా ఈ ఫారమ్‌ను పూరించవచ్చు. తర్వాత గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ధృవీకరణ పత్రాన్ని సమర్పించాలి.

ఫారమ్ నింపడానికి అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 1 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయస్సులో సడలింపు లభిస్తుంది.

జీతం

ఎస్బీఐ పీఓ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ మూల వేతనం రూ. 48,480. ఇది కాకుండా ఇతర రకాల అలవెన్సులు కూడా ఇస్తారు. అభ్యర్థులను టైర్-1, టైర్-2, ఇంటర్వ్యూ మొదలైన దశల ద్వారా ఎంపిక చేస్తారు. టైర్ 1 పరీక్ష – జూలై/ఆగస్టులో ఉండే అవకాశం ఉంది.

ఎస్బీఐ పీఓ రాత పరీక్ష సిలబస్‌లో ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఉన్నాయి. ఇందులో టైర్-1లో 100 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష వ్యవధి 1 గంట ఉంటుంది. ఈ నియామకానికి సంబంధించిన ఏవైనా ఇతర సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

దరఖాస్తు రుసుం

అన్‌రిజర్వ్డ్/ఈడబ్ల్యూఎస్/ఓబీసీ అభ్యర్థులు రూ. 750 దరఖాస్తు రుసుము చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యీబీడీ అభ్యర్థులకు ఎటువంటి రుసుము లేదు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.