విదేశాల్లో చదువుకునేందుకు ఎస్బీఐ 50 లక్షల ఎడ్యుకేషన్ లోన్.. ఎలాంటి పూచీకత్తూ అవసరం లేదు!
SBI Education Loan : మీరు విదేశాలలో చదువుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? మీ కోసం ఎస్బీఐ మంచి అవకాశం అందిస్తోంది. ఎస్బీఐ గ్లోబల్ ఎడ్ వాంటేజ్ స్కీమ్ ద్వారా రూ.50 లక్షల వరకు కొలేటరల్ ఫ్రీ లోన్‌లను పొందవచ్చు.
విదేశాల్లో చదువుకోవాలన్న విద్యార్థుల కలలను సాకారం చేసుకునేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో ఉన్నత చదువుల కోసం పూచీకత్తు లేని విద్యా రుణాల పరిమితిని బ్యాంక్ ఇటీవల పెంచింది. మీరు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తే ఇది ఎంతగానో సాయపడుతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ గ్లోబల్ ఎడ్ వాంటేజ్ పథకం ద్వారా రూ.50 లక్షల వరకు కొలేటరల్ ఫ్రీ ఎడ్యుకేషన్ లోన్‌లను అందిస్తోంది.
కొలేటరల్-ఫ్రీ లోన్ అంటే
కొలేటరల్ ఫ్రీ లోన్ విషయంలో రుణగ్రహీత సెక్యూరిటీగా ఎలాంటి ఆస్తులను తాకట్టు పెట్టనవసరం లేదు. రుణ అర్హతను నిర్ణయించడానికి దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని బట్టి రుణం తాత్కాలికంగా మంజూరు చేస్తారు. రుణం కోసం తాకట్టు పెట్టడానికి అవసరమైన ఆస్తులు లేని వారికి ఈ రకమైన రుణం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఎస్బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ అంటే
ఎస్బీఐ గ్లోబల్ ఎడ్-వాంటేజ్ అనేది విదేశీ కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో ఫుల్‌టైమ్ కోర్సులు చేయాలనుకునే విద్యార్థుల కోసం రూపొందించిన విద్యా రుణం. ఈ పథకం కింద విద్యార్థులు పూచీకత్తు ఇవ్వకుండానే రూ.50 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే ఈ స్కీమ్ ఉద్దేశం.
ఈ పథకంలోని కీలక అంశాలు
విద్యార్థులు ఎలాంటి సెక్యూరిటీ లేదా పూచీకత్తు ఇవ్వకుండానే రూ.50 లక్షల వరకు రుణాలు పొందవచ్చు. ఎంపిక చేసిన సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. లోన్ రీపేమెంట్ పీరియడ్ 15 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇది ఈఎంఐ ద్వారా తిరిగి చెల్లించడానికి అనుమతి ఇస్తుంది. విద్యార్థి ఫారం ఐ-20 లేదా వీసా పొందకముందే రుణాన్ని ఆమోదించవచ్చు.
ఈ కోర్సులు చదవచ్చు
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80 (ఇ) కింద విద్యార్థులు పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. దీంతో విద్యా రుణంపై చెల్లించే వడ్డీపై మినహాయింపు లభిస్తుంది. ఈ రుణం అనేక రకాల కోర్సులను కవర్ చేస్తుంది. వీటిలో : గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు, డిప్లొమా, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్, ఏదైనా విభాగంలో డాక్టరేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈ స్కీమ్ కింద ట్యూషన్, హాస్టల్, ఎగ్జామినేషన్, లైబ్రరీ, ప్రయోగశాల ఫీజులు కవర్ అవుతాయి. విదేశాల్లో చదవడానికి ప్రయాణ ఖర్చులు, కోర్సు స్టడీ టూర్ లు, ప్రాజెక్ట్ వర్క్, థీసిస్ ఖర్చులకు అవసరమైన పుస్తకాలు, పరికరాలువంటివి కవర్ అవుతాయి. ఒక్కో దరఖాస్తుకు రూ.10,000 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తారు. రూ.7.5 లక్షల నుంచి రూ.50 లక్షల లోపు రుణాలపై వడ్డీ రేటు 10.15 శాతంగా ఉంటుంది.
విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఎస్బీఐ పూచీకత్తు లేని విద్యా రుణం చాలా గొప్పదని పలువురు ప్రశంసిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందిలేని తిరిగి చెల్లింపు నిబంధనలు, ప్రధాన ఖర్చులకు కవరేజీతో ఈ పథకం ఆర్థిక అడ్డంకులను తగ్గిస్తుంది. విద్యార్థులు వారి టార్గెట్స్ సాధించడంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది.
గమనిక : మరింత సమాచారం కోసం, దరఖాస్తు చేయడానికి ఎస్పీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. లేదంటే మీ సమీప ఎస్బీఐ బ్రాంచ్‌కి వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.