తెలంగాణలోని ట్రిపుల్ ఐటీ(ఆర్జీయూకేటీ) క్యాంపస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల ఆధారంగా…. మెరిట్ లిస్ట్ ను విడుదల చేశారు. వీరికి సంబంధించిన జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అయితే ప్రాథమికంగా ఎంపికైన ఈ విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను కూడా అధికారులు ప్రకటించారు.
ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశాలకు ప్రాథమికంగా ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జూలై 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. ఇందుకు హాజరయ్యే విద్యార్థులు… నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.
మరోవైపు ఆర్మీ, NCC, స్పోర్ట్స్, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. తాజాగా మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులకు కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి…. ఆగస్టు నాలుగు నుంచి తరగతులను ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో బాసరతో పాటు మహబూబ్ నగర్ లో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 1,690 సీట్లు ఉండగా… ఈసారి 72 శాతం సీట్లు బాలికలకే దక్కాయి. బాలికలు 1,225 మంది(72 శాతం) ఉండగా… బాలురు 465 మంది(18 శాతం) ఉన్నారు. ఇక నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన విద్యార్థులు ఏకంగా 889 మంది ఎంపికయ్యారు.
ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది.ప్రాథమికంగా ఎంపిక మెరిట్ జాబితాను https://www.rgukt.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత యూజీ అడ్మిషన్స్ 2025పై క్లిక్ చేయాలి. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రొవిజినల్ సెలెక్టడ్ లిస్ట్ ఆఫ్ యూజీ అడ్మిషన్స్ - 2025 అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి లిస్ పొందవచ్చు.
గ్రామీణ విద్యార్ధులను సాంకేతిక విద్యా రంగంలో ముందు నిలిపే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు తీవ్ర పోటీ ఉంటుంది. కేవలం మెరిట్ ఆధారంగానే సీట్లను భర్తీ చేస్తారు. అడ్మిషన్ కోసం అప్లై చేసుకున్న విద్యార్థుల్లో సమాన మార్కులు వచ్చినప్పుడు, సబ్జెక్టులలో వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లిష్, సోషల్, ఫస్ట్ లాంగ్వేజ్ సబ్జెక్టులను వరుసగా పరిగణిస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే, వయస్సును పరిగణనలోకి తీసుకొని పెద్దవారికి సీట్లు కేటాయిస్తుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తారు.