Reliance Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్ షిప్ ఫలితాలు విడుదల, సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు
Reliance Foundation Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ 2024-25 బ్యాట్ స్కాలర్ షిప్ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు లక్ష అప్లికేషన్లలో ఉత్తమ ప్రతిభ గల 5 వేల మందిని ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి 25% మంది ఉన్నారు. ఏపీ నుంచి 850 మంది, తెలంగాణ నుంచి 411 మంది విజయం సాధించారు.
Reliance Foundation Scholarships : రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు 2024-25 బ్యాచ్‌కు సంబంధించిన ఫలితాలను శనివారం ప్రకటించారు. రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లకు దేశవ్యాప్తంగా సుమారు లక్ష మంది దరఖాస్తుచేసుకున్నారు. వీరిలో 5,000 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు స్కాలర్ షిప్ లకు ఎంపిక అయినట్లు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. ఈ స్కాలర్ షిప్ లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ప్రతిభ చూపారు.
రిలయన్స్ ఫౌండేషన్ 10 సంవత్సరాలలో 50 వేల మందికి స్కాలర్ షిప్ లు అందించాలని 2022లో లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేటు స్కాలర్‌షిప్ కార్యక్రమంగా ఇది గుర్తింపు పొందింది. విద్యార్థులకు సమాన అవకాశాలను అందించేందుకు, చదువుల్లో ప్రోత్సహించేందుకు ఈ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు రిలయన్స్ సంస్థ తెలిపింది. 1996లో ప్రారంభమైన ధీరుభాయ్ అంబానీ స్కాలర్‌షిప్‌లు, 2020లో ప్రవేశపెట్టిన రిలయన్స్ ఫౌండేషన్ స్కాలర్‌షిప్‌లు, ఇప్పటివరకు 28,000 మంది యువతకు ఆర్థిక సాయం అందించాయి. 2022లో ధీరుభాయ్ అంబానీ 90వ జయంతి సందర్భంగా, నీతా అంబానీ 10 సంవత్సరాలలో 50,000 స్కాలర్‌షిప్‌ల అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా యువ ప్రతిభను వెలికితీయడంతో పాటు, వారిని అగ్రగాములుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తోందని నిర్వాహకులు తెలిపారు.
స్కాలర్‌షిప్ ముఖ్యాంశాలు
* దేశం నలుమూలల నుంచి వచ్చిన అప్లికేషన్లలో 5,000 మంది విద్యార్థులను స్కాలర్ షిప్ లకు ఎంపిక చేశారు. వివిధ రంగాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు.
* రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం, ట్యూషన్, హాస్టల్, ఇతర విద్యా ఖర్చులు అందిస్తారు.
* ఎంపికైన విద్యార్థుల్లో 70% మంది... వార్షిక ఆదాయం రూ. 2.5 లక్షల కంటే తక్కువ కలిగిన కుటుంబాల నుంచి వచ్చిన వారే.
* కెపాసిటీ-బిల్డింగ్ ప్రోగ్రామ్, విద్యార్థుల వ్యక్తిత్వ, నాయకత్వ నైపుణ్యాలను మెరుగుపరచడంలో ఈ స్కాలర్ షిప్ సహాయపడుతుంది.
* మెంటరింగ్: పరిశ్రమ నిపుణుల నుంచి విద్యా, ప్రొఫెషనల్ అభివృద్ధి కోసం మార్గదర్శనం
* వర్క్‌షాపులు, శిక్షణలు: సాంకేతిక,సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించడం
* సేవా కార్యక్రమాలు: సామాజిక సేవలలో పాల్గొని సమాజానికి తిరిగి ఇవ్వడం
ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ... "అసాధారణమైన యువ ప్రతిభకు మద్దతు ఇవ్వడం మాకు గర్వకారణం. రిలయన్స్ ఫౌండేషన్ అండర్‌గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌ల ద్వారా, విద్యార్థులు తమ సామర్థ్యాన్ని ఉపయోగించి దేశ అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషించేందుకు ప్రోత్సహించాలనుకుంటున్నాం. ఈ సంవత్సరం ఒక లక్ష దరఖాస్తులు రాగా, ఎంపికైన వారంతా దేశంలో అత్యుత్తమ ప్రతిభావంతులలో ఒకరిగా ఉన్నారు. విద్య అనేది అవకాశాలను అందించే మూల ధనం"
రిలయన్స్ స్కాలర్ షిప్ 2024-25 బ్యాచ్ లో ఏపీ, తెలంగాణ విద్యార్థులు తమ ప్రతిభతో భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. 850 మంది విద్యార్థులతో ఆంధ్రప్రదేశ్ దేశంలో 1వ స్థానంలో నిలవగా, 411 మంది విద్యార్థులతో తెలంగాణ 4వ స్థానం సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 1,261 మంది అభ్యర్థులు (25.22%) స్కాలర్‌షిప్ సాధించారు.
స్కాలర్ షిప్ ఫలితాలు ఇలా చెక్ చేసుకోండి
1. రిలయన్స్ ఫౌండేషన్ వెబ్‌సైట్‌లో ఫలితాల పేజీని https://scholarships.reliancefoundation.org/UGScholarship_ApplicationStatus.aspx సందర్శించండి.
2. మీ 17-అంకెల అప్లికేషన్ నంబర్ లేదా ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయండి.
3. ‘సబ్మిట్’ బటన్ పై క్లిక్ చేయండి.