AP Anganwadi Recruitment 2024 : తిరుపతి జిల్లాలో 101 అంగన్వాడీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
Anganwadi jobs in Tirupati District : తిరుపతి జిల్లాలో 101 అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయింది. అర్హులైన అభ్యర్థులు జనవరి 6వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎలాంటి రాత పరీక్ష లేదు.
తిరుపతి జిల్లాలో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. దరఖాస్తు దాఖలకు జనవరి 6 ఆఖరు తేదీగా నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా మహిళ, శిశు సంక్షేమ, సాధికారిత అధికారి వారి కార్యాలయం నుండి వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న101 పోస్టులను భర్తీ చేయనున్నారు. పదో తరగతి అర్హతతో భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
పోస్టుల వివరాలు….
తిరుపతి జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 101 పోస్టులు కాగా, అందులో 17 అంగన్‌వాడీ వర్కర్, 73 అంగన్‌వాడీ హెల్పర్, 11 మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగులకు స్థానికంగా నివసిస్తున్న వివాహిత మహిళ అర్హులు. కాబట్టి ఎంపికైన వారు తాము నివసిస్తున్న ప్రదేశంలోనే ఉద్యోగం చేయొచ్చు. అర్హత గత వారు జనవరి 6 తేదీలోపు సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అంగన్‌వాడీ కార్యకర్త ఉద్యోగాలకు పదో తరగతి పూర్తి చేయడం తప్పని సరి. అంగన్‌వాడీ సహాయకురాలు ఉద్యోగాలకు ఏడో తరగతి అర్హత ఉన్న వారు అర్హులు. కనీస వయస్సు 2024 జూలై 1 నాటికి 21 సంవత్సరాలు, గరిష్ఠ వయస్సు 35 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు కలిగిన అభ్యర్థి లేకపోయినట్లుయితే 18 సంవత్సరాలు నిండిన వారి అప్లికేషన్ కూడా పరిగణనలోకి తీసుకుంటారు. 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు లేకుంటే దిగువ తరగతులు 9 లేదా 8 తరగతి వారు అర్హులుగా ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు.
జీతం ఎంతంటే…
అంగన్‌వాడీ కార్యకర్తకు రూ.11,500, అంగన్‌వాడీ సహాయకులకు రూ.9,000, మినీ అంగన్ వాడీ కార్యకర్తకు రూ.9,000 నెల జీతం ఉంటుంది. ఇంటర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి పరీక్ష లేదు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. అభ్యర్థి స్వయంగా వెళ్లి సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయంలో తమ అప్లికేషన్ అందజేయాలి. బయోడేటాతో పాటు అన్ని విద్యా అర్హత, ఇతర సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలపై గెజిటెడ్ ఆఫీసర్‌తో అటెస్టేషన్ చేయించాలి. ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అప్లికేషన్ అందజేయాలి.
ఈ పోస్టులకు అభ్యర్థులను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటి ఎంపిక చేస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణత పొందినందుకు 50 మార్కులు, ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందితే 5 మార్కులు, విడోకు 5 మార్కులు, చిన్నపిల్లలతో కూడిన విడోకు 5 మార్కులు, అనాధులుగా ఉండి అభ్యర్థికి 10 మార్కులు, దివ్యాంగ అభ్యర్థులకు 5 మార్కులు, ఇంటర్వ్యూకు 20 మార్కులు మొత్తం 100 మార్కులు ఉంటాయి.
కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు
1. పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం
2. పదో తరగతి సర్టిఫికేట్
3. కుల ధువ్రీకరణ పత్రం
4. స్థానిక నివాస ధ్రువీకరణ పత్రం
5. వివాహితురాలైతే వివాహ ధ్రువీకరణ పత్రం
6. అనుభవం ఉంటే, అనుభవ పత్రం
7. దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన సర్టిఫికేట్
8. వితంతువులతే భర్త మరణ ధ్రువీకరణ పత్రం
9. ఆరో తరగతి నుంచి స్టడీ సర్టిఫికేట్స్
10. టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉంటే, దాని సర్టిఫికేట్