PADA Posts : పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 17 పోస్టుల భర్తీకి లైన్ క్లియర్, కలెక్టర్ ఉత్తర్వులు
PADA Posts : పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో 17 పోస్టుల భర్తీకి కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిల్లో 12 పోస్టులను ఔట్ సోర్సింగ్ విధానంలో , నాలుగు డిప్యూటేషన్ పై భర్తీ చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం పీఏడీఏను ఏర్పాటు చేసింది.
PADA Posts : పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(పీఏడీఏ)లో పోస్టులు భర్తీకి లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే ఐదుగురు అధికారులను డిప్యూటేషన్‌పై కేటాయిస్తారు. మొత్తం 17 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్‌ను జిల్లా కలెక్టర్, పీఏడీఏ ఛైర్మన్ విడుదల చేస్తారని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పీఏడీఏ కార్యకలాపాలకు మార్గం సుగమమం అయింది.

ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ జీవోఎంఎస్ నెంబర్ 1ను విడుదల చేశారు. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం పిఠాపురంలో ప్రధాన కార్యాలయంతో పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ (పీఏడీఏ)ని ఏర్పాటుచేసింది. పీఏడీఏని ఏర్పాటు చేస్తూ 2024 నవంబర్ 22న జీవోఎంఎస్ 97ను విడుదల చేసింది.
పీఏడీఏలో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడం, పర్యవేక్షణ కోసం పీఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడానికి వివిధ పోస్టులు అవసరం అయ్యాయి. వాటిని మంజూరు చేయాలని పీఏడీఏ ఛైర్మన్, కాకినాడ జిల్లా కలెక్టర్ 2024 నవంబర్ 27న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు.
ఈ ప్రతిపాదనలను పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం, పిఠాపురంలో పీఏడీఏ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కోసం, పరిపాలనను సజావుగా నిర్వహించడానికి పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
అయితే ఈ పోస్టుల్లో కొన్ని ప్రభుత్వ అధికారులను డిప్యూటేషన్‌పై కేటాయిస్తారు. ఇలా ఐదుగురు అధికారులను డిప్యూటేషన్‌పై కేటాయించగా, 12 పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
డిప్యూటేషన్‌పై కేటాయించే పోస్టులు
1. ప్రాజెక్టు డైరెక్టర్ (ఏపీ కేడర్ ఐఎఎస్ అధికారి, ఆర్డీవోగా పని చేసే సీనియర్ డిప్యూటీ కలెక్టర్) -1
2. డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్/ఎంపీడీవో -1
3. తహసీల్దార్ -1
4. సీనియర్ అసిస్టెంట్ -2
భర్తీ చేసే ఉద్యోగాలు
మొత్తం 12 పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
1. జూనియర్ అసిస్టెంట్ -2
2. డేటా ఎంట్రీ ఆపరేటర్ -2
3. పీఎంయూ టీమ్ -2
4. ఆఫీస్ సబార్డినేట్-4
5. వాచ్‌మెన్ -2
కాకినాడ జిల్లా కలెక్టర్, పీఏడీఏ ఛైర్మన్ దీనికి సంబంధించిన తదుపరి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతితోనే ఇచ్చినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ పీయూష్ కుమార్ తెలిపారు.
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ
పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (పీఏడీఏ) ఏర్పాటుకు నవంబర్ 6న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. పీఏడీఏ ఏర్పాటుకు నవంబర్ 26న అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పిఠాపురంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించి, వాటిని అమలు చేయడమే పీఏడీఏ లక్ష్యంగా ఉంది. ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలను పెంచేలా నిర్ణయాలు తీసుకుంటారు.
పిఠాపురం తీర, మెట్ట, మైదానం కలిసిన నియోజకవర్గం. మూడు మండలాలు 52 గ్రామ పంచాయతీలున్న ఈ నియోజకవర్గంలో పిఠాపురం మున్సిపాలటీ, గొల్లప్రోలు నగర పంచాయతీలు ఉన్నాయి.
ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండే పిఠాపురంలో పీఏడీఏ ఏర్పాటుతో మార్పులు వస్తాయని ప్రజలు భావిస్తోన్నారు. పీఏడీఏ ఏర్పాటులో పిఠాపురం ఎమ్మెల్యే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషి, చొరవ ఉన్నాయని జనసేన నేతలు పేర్కొంటున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు