దూర విద్యలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్(డిస్టెన్స్) కార్యాలయం నుంచి ప్రకటన జారీ అయింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఫేజ్ -2 ప్రవేశాల కింద అడ్మిషన్లు కల్పిస్తారు. ప్రవేశ పరీక్ష కోసం ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మార్చి 24 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మార్చి 27వ తేదీతో పూర్తవుతుంది. మార్చి 28వ తేదీన ఎంట్రెన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. తెలంగాణ ఐసెట్- 2024లో అర్హత సాధించిన అభ్యర్థులు నేరుగా ఈ కోర్సుల్లో అడ్మిషన్లను పొందవచ్చు. ప్రత్యేకంగా ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
ఇక దరఖాస్తు చేసుకునే అభ‌్యర్థులు కనీస విద్యార్హతలు కలిగి ఉండాలి. ఎంబీఏ కోర్సులకు ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ కలిగి ఉండాలి. పదవ తరగతి తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా పది తర్వాత ఇంటర్ తో పాటు నాలుగేళ్ల డిగ్రీ, పది తర్వాత మూడేళ్ల డిప్లోమా ఆ తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు ఎంబీఏ కోర్సులకు దరఖాస్తు చేయవచ్చు. పదో తరగతిలో తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంసీఏ కోర్సులకు పది తర్వాత ఇంటర్, డిగ్రీ లేదా ఇంజనీరింగ్, డిప్లొమా తర్వాత డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఎంసీఏ కోర్సులకు డిగ్రీలో తప్పనిసరిగా మ్యాథ్స్ చదివి ఉండాలి. దూర విద్యలో మ్యాథ్స్ డిగ్రీ చదివిన వారిని కూడా అర్హులుగా గుర్తిస్తారు. డిగ్రీలో మ్యాథ్స్ చదవని విద్యార్థులు ఇంటర్‌లోనైనా మ్యాథ్స్ సబ్జెక్టును చదివి ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www.ouadmissions.com లేదా www.osmania.ac.in లేదా www.oucde.net వెబ్ సైట్ ద్వారా ప్రాసెస్ చేసుకోవచ్చని నోటిఫికేషన్ లో తెలిపారు.
మరోవైపు ఉస్మానియా యూనివర్శిటీలో దూర విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు యూజీ, పీజీ, డిప్లోమా కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. 2024 - 2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ఫేజ్ 2 కింద ప్రవేశాలు కల్పించనున్నట్లో ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం 72 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు 8886111690, 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని నోటిఫికేషన్ లో తెలిపారు.
సంబంధిత కథనం