ఏపీ డీఎస్సీ.. పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు.. ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ!-officials working on setting up andhra pradesh dsc 2025 examination centers ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డీఎస్సీ.. పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు.. ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ!

ఏపీ డీఎస్సీ.. పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు.. ఒక్కో పోస్టుకు 35 మంది పోటీ!

డీఎస్సీ పరీక్షా కేంద్రాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. గడువుకంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రోజుకి 40 నుంచి 50 వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఐయాన్‌ కేంద్రాలు ఎంపిక పూర్తయ్యింది.

ఏపీ డీఎస్సీ అప్‌డేట్స్ (pixabay)

మెగా డీఎస్సీ-2025 పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మే 15వ తేదీతో ఆన్‌లైన్‌ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తం ఎంత మంది అభ్యర్థులు పరీక్షలు రాయబోతున్నారన్న డేటా అధికారుల వద్ద ఉంది. దీంతో పరీక్ష కేంద్రాల ఎంపికపై దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు.

ఇంజినీరింగ్‌ కళాశాలల్లోనూ..

అధికారిక సమాచారం మేరకు.. ఇప్పటి వరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్‌ అయాన్‌ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6 తేదీ నుంచి జరగనున్న డీఎస్సీ పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు ఈ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతోపాటు.. రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కూడా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే వారితోకూడా సంప్రదింపులు జరిపారని తెలిసింది.

మార్పులు లేకుండా..

డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియేషన్స్‌, షెడ్యూల్‌ మార్పులు లేకుండా.. అధికారులు ముందుకెళ్తున్నారు. వారి స్పీడ్‌ చూస్తుంటే.. పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్‌ కంటే ముందే పూర్తిచేసేలా ఉన్నారు. ఇప్పటికే టీసీఎస్‌ అయాన్‌ కేంద్రాలు ఎంపిక చేయగా.. వాటి సామర్థ్యం రోజుకి సరాసరి 20 వేల మందికి రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. వీటితోపాటు ఇంజినీరింగ్‌ కళాశాలలు అందుబాటులోకి వస్తే.. మరో 20 నుంచి 30 వేల మందికి ఒకేరోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40 వేల మంది చొప్పున చూసుకున్నా.. గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే అని అధికారులు చెబుతున్నారు.

ఎస్సీ వర్గీకరణ అమలు..

ఎస్సీ వర్గీకరణ ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ నుంచే అమలు చేస్తున్నారు. ఆ మేరకు పోస్టులను ప్రకటించగా.. ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అన్నది కూడా అధికారులు తెలియజేశారు. ఎస్సీ జీఆర్‌ 1, జీఆర్‌ 2, జీఆర్‌ 3 కింద మూడు కేటగిరీల్లో వరుసగా.. 1,848, 45,419, 61,905 మంది అభ్యర్థులు దరఖాస్తులు చేశారు. మొత్తం 16,347 ఉద్యోగాలకు 3,35,401 మంది అభ్యర్థులు వివిధ పోస్టులకు కలిపి 5,77,417 దరఖాస్తులను నమోదు చేశారు.

ఒక్కో పోస్టుకు 35 మంది..

ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీ పడనున్నారు. ఆన్‌లైన్‌ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. దాదాపు 2,03,647 మంది మహిళా అభ్యర్థులు, 1,31,754 మంది పురుషుల నుంచి దరఖాస్తులు వచ్చినట్లు ఎస్సీఆర్టీ డైరెక్టర్‌, డీఎస్సీ కన్వీనర్‌ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ నాటికి హాల్‌టికెట్లు విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

కర్నూలు జిల్లా టాప్..

డీఎస్సీ పోస్టులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలకు సంబంధించి అభ్యర్థుల నుంచి భారీగా దరఖాస్తులు నమోదయ్యాయి. మొత్తం 2678 పోస్టులు ఉండగా.. 39,997 మంది అభ్యర్థుల నుంచి మొత్తం 73,605 అప్లికేషన్లు వచ్చాయి. నెల్లూరు జిల్లాలో మొత్తం పోస్టులు 673 ఉండగా... 15,993 మంది అభ్యర్థుల నుంచి 28,772 అప్లికేషన్లు వచ్చాయి. ఇక్కడే అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. ఇతర రాష్ట్రాల నుంచి 7,159 మంది అభ్యర్థుల నుంచి 10,143 అప్లికేషన్లు వచ్చాయి.

సంబంధిత కథనం