Fact Check : ఏపీ, తెలంగాణలో 13 వేల ఉద్యోగాలంటూ ఫేక్ నోటిఫికేషన్ - నిరుద్యోగులారా.... జాగ్రత్తగా ఉండండి..!-fact check on fake nrdrm recruitment 2025 notification ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Fact Check : ఏపీ, తెలంగాణలో 13 వేల ఉద్యోగాలంటూ ఫేక్ నోటిఫికేషన్ - నిరుద్యోగులారా.... జాగ్రత్తగా ఉండండి..!

Fact Check : ఏపీ, తెలంగాణలో 13 వేల ఉద్యోగాలంటూ ఫేక్ నోటిఫికేషన్ - నిరుద్యోగులారా.... జాగ్రత్తగా ఉండండి..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 06, 2025 12:29 PM IST

Fake Notification: కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌ఆర్‌డీఆర్‌ఎం నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడినట్లు వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. ఏపీ, తెలంగాణ పరిధిలో 13 వేల ఖాళీలు ఉన్నట్లు ఇందులో ఉంది. అయితే ఇది ఫేక్ న్యూస్ అని తేలింది. నిరుద్యోగులు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు.

ఫేక్ ఉద్యోగ నోటిఫికేషన్...!
ఫేక్ ఉద్యోగ నోటిఫికేషన్...!

కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎన్‌ఆర్‌డీఆర్‌ఎం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ ఓ ప్రకటన సర్క్యులేట్ అవుతోంది. ఏపీ, తెలంగాణలో కలిపి 13,762 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్లు ఇందులో పేర్కొన్నారు. నోటిఫికేషన్ వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్లను స్వీకరిస్తున్నారు. ఇందుకు ఫిబ్రవరి 28వ తేదీని తుది గడువు అని పేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ చూసిన పలువురు ఉద్యోగ అభ్యర్థులు ఆన్ లైన్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించి అసలు విషయం బయటికి వచ్చింది. ఈ నోటిఫికేషన్ ను బోగస్ ప్రకటనగా గుర్తించారు. ఉద్యోగ అభ్యర్థుల నుంచి డబ్బులను లాగేందుకు ఫేక్ వెబ్ సైట్ ను సృష్టించినట్లు తేల్చారు.

అది నకిలీ నోటిఫికేషన్ -

ఈ ఉద్యోగ ప్రకటన విషయంపై కేంద్ర గ్రామీణాభివృద్ధి డిప్యూటీ సెక్రటరీ ప్రదీప్ కుమార్‌ స్పందించినట్లు ఫ్యాకల్టీ వెబ్ సైట్ కథనం పేర్కొంది. వీటి వివరాల ప్రకారం… ఇది నకిలీ నోటిఫికేషన్ అని ప్రదీప్ కుమార్‌ స్పష్టం చేశారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ వెబ్ సైట్ లో ఈ పేరుతో ఎటువంటి డిపార్ట్మెంట్ కానీ స్కీమ్ కానీ లేదని తెలిపారు. జూలై 2022లో కూడా ఇదే తరహా పేరుతో ఒక నోటిఫికేషన్ ప్రచారం జరిగిందని.. అది కూడా నకిలీదిగా తేలిందని చెప్పారు. ఇలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

నేషనల్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ అండ్‌ రిక్రియేషన్‌ మిషన్‌ పేరిట వైరల్ అవుతున్న ఉద్యోగ ప్రకటన ఫేక్ అని న్యూస్ చెకర్ ఫ్యాక్ట్ చెక్ పరిశీలనలో కూడా తేలింది. నిరుద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నమని పేర్కొంది. ఇదొక ఫ్రాడ్ నోటిఫికేషన్ అని స్పష్టం చేసింది.

ఈ ఉద్యోగ ప్రకటన విషయాన్నితాము కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు న్యూస్ చెకర్ వెబ్ సైట్ తెలిపింది. “ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద NRDRM అని పిలువబడే అటువంటి సంస్థ ఏదీ లేదు. ఈ ఫేక్ యాడ్ పై అలర్ట్ చేసేలా తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించాం" అని ఐఈసీ విభాగాధిపతి అఖిలేశ్ జా చెప్పినట్లు తన కథనంలో ప్రస్తావించింది.

జాగ్రత్తగా ఉండాల్సిందే …

ఉద్యోగ నోటిఫికేషన్లు విషయంలో అభ్యర్థులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ల ప్రకటనలు లేదా వాటి వెబ్ సైట్ వివరాలను తప్పకుండా క్రాస్ చేసుకోవాలని చెబుతున్నారు. ప్రభుత్వ వెబ్ సైట్ డొమైన్లు అడ్రస్ లు gov.in’ లేదా ‘nic.inతో ముగుస్తాయని... డొమైన్ అడ్రస్ తేడా ఉంటే అలాంటి సైట్లలోకి వెళ్లకపోవటం మంచిదని పేర్కొంటున్నారు.

తప్పుడు ప్రకటనల విషయంలో జాగ్రత్తగా ఉండాలని… బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులను మళ్లించే ప్రయత్నాలు జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరమైన లింక్స్ ను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు. బ్యాంక్ వివరాలతో పాటు ఓటీపీ వంటి వివరాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం