AP Anganwadi Jobs : అంగ‌న్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, జీతం.. పూర్తి వివరాలివే-notification released for filling anganwadi posts in andhra pradesh ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Anganwadi Jobs : అంగ‌న్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, జీతం.. పూర్తి వివరాలివే

AP Anganwadi Jobs : అంగ‌న్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. అర్హతలు, జీతం.. పూర్తి వివరాలివే

HT Telugu Desk HT Telugu

AP Anganwadi Jobs : అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌లైంది. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల ప‌రిధిలో ఖాళీగా ఉన్న948 పోస్టుల‌ను ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో భ‌ర్తీ చేయనున్నారు. అర్హుల నుంచి ద‌ర‌ఖాస్తులు కోరుతున్నారు. ఈ పోస్టుల‌కు సంబంధించి ఆయా జిల్లాల క‌లెక్టర్లు నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు.

అంగ‌న్‌వాడీ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

రాష్ట్రంలో మొత్తం 948 అంగన్‌వాడీ పోస్టులను భ‌ర్తీ చేస్తున్నారు. అందులో 160 అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్‌, 728 అంగ‌న్‌వాడీ హెల్ప‌ర్‌, 60 మినీ అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్‌ పోస్టులు ఉన్నాయి. పార్వతీపురం మ‌న్యం జిల్లాలో 17 పోస్టులు ఉన్నాయి. అర్హ‌త గ‌లవారు మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంట‌ల‌లోపు సంబంధిత ఐసీడీఎస్‌ కార్యాల‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగుల‌కు స్థానికంగా నివాసిస్తున్న వివాహిత మ‌హిళ అర్హులు.

అర్హతలు..

అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త ఉద్యోగాల‌కు ప‌దో త‌ర‌గ‌తి పూర్తి చేయ‌డం త‌ప్ప‌నిస‌రి. అంగ‌న్‌వాడీ స‌హాయ‌కురాలు ఉద్యోగాల‌కు ఏడో త‌ర‌గ‌తి అర్హ‌త ఉన్న వారు అర్హులు. క‌నీస వ‌య‌స్సు 2025 జూలై 1 నాటికి 21 సంవ‌త్స‌రాలు, గ‌రిష్ఠ వ‌య‌స్సు 35 సంవ‌త్స‌రాలు. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు కేటాయించిన పోస్టులు ఉన్న ప్రాంతాల్లో 21 ఏళ్లు క‌లిగిన అభ్య‌ర్థి లేక‌పోతే.. 18 సంవ‌త్స‌రాలు నిండిన వారి అప్లికేష‌న్ కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు.

జీతం..

అంగ‌న్‌వాడీ కార్య‌కర్త‌కు రూ.11,500, మినీ అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌లకు రూ.9,000, అంగ‌న్‌వాడీ స‌హాయ‌కుల‌కు రూ.9,000 నెల జీతం ఉంటుంది. ఇంట‌ర్వ్యూ, మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎటువంటి ప‌రీక్ష లేదు. ఎటువంటి అప్లికేష‌న్ ఫీజు లేదు. అభ్య‌ర్థి స్వ‌యంగా వెళ్లి సంబంధిత ఐసీడీఎస్‌ కార్యాల‌యంలో త‌మ అప్లికేష‌న్ అంద‌జేయాలి. బ‌యోడేటాతో పాటు అన్ని విద్యా అర్హ‌త, ఇత‌ర స‌ర్టిఫికెట్లు జిరాక్స్ కాపీల‌పై గెజిటెడ్ ఆఫీస‌ర్‌తో అటెస్టేష‌న్ చేయించి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాల‌యాల్లో అప్లికేష‌న్ అంద‌జేయాలి.

ఎంపిక..

ఈ పోస్టుల‌కు అభ్య‌ర్థుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలోని కమిటి ఎంపిక చేస్తోంది. ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త పొందినందుకు 50 మార్కులు, ప్రీ స్కూల్ ట్రైనింగ్ పొందితే 5 మార్కులు, విడోకు 5 మార్కులు, చిన్న‌పిల్ల‌ల‌తో కూడిన విడోకు 5 మార్కులు, అనాథలుగా ఉండే అభ్య‌ర్థికి 10 మార్కులు, దివ్యాంగు అభ్య‌ర్థుల‌కు 5 మార్కులు, ఇంట‌ర్వ్యూకు 20 మార్కులు.. మొత్తం 100 మార్కులు ఉంటాయి. పూర్తి వివ‌రాల కోసం సంబంధిత ఐసీడీఎస్ కార్యాల‌యాల‌ను సంప్ర‌దించాల‌ని అధికారులు చెబుతున్నారు.

కావాల్సిన ప‌త్రాలు..

1. పుట్టిన తేదీ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

2. ప‌దో త‌ర‌గ‌తి స‌ర్టిఫికెట్‌

3. కుల ధువ్రీక‌ర‌ణ ప‌త్రం

4. స్థానిక నివాస ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

5. వివాహితురాలైతే వివాహ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

6. అనుభ‌వం ఉంటే, అనుభ‌వ ప‌త్రం

7. దివ్యాంగురాలైతే దానికి సంబంధించిన స‌ర్టిఫికెట్‌

8. వితంతువుల‌తే భ‌ర్త మ‌ర‌ణ ధ్రువీక‌ర‌ణ ప‌త్రం

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

 

HT Telugu Desk