AP Job Notification : గుంటూరు జిల్లా ఆసుప‌త్రిలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే-notification for recruitment in guntur district hospital ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  Ap Job Notification : గుంటూరు జిల్లా ఆసుప‌త్రిలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే

AP Job Notification : గుంటూరు జిల్లా ఆసుప‌త్రిలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్.. ముఖ్య‌మైన వివ‌రాలు ఇవే

HT Telugu Desk HT Telugu

AP Job Notification : వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ శాఖ ఆధ్వ‌ర్యంలోని గుంటూరు జిల్లా సెకెండ‌రీ హెల్త్ హాస్ప‌టల్‌లో ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల అయింది. ద‌ర‌ఖాస్తును దాఖ‌లు చేసుకోవ‌డానికి ఆఖ‌రు తేదీ మార్చి 18గా నిర్ణ‌యించారు. ఆస‌క్తి, అర్హ‌త ఉన్నఅభ్య‌ర్థులు స‌కాలంలో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

గుంటూరు జిల్లా ఆసుప‌త్రిలో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేష‌న్

గుంటూరు జిల్లా సెకెండ‌రీ హెల్త్ హాస్ప‌టల్‌లో ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులను కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ప‌ద్ద‌తుల్లో భ‌ర్తీ చేస్తున్నారు. మొత్తం 30 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. డెంట‌ల్ టెక్నిషియ‌న్‌-1, ల్యాబ్ టెక్నిషియ‌న్‌-2, ఎలక్ట్రీషియన్-2, కౌన్సిలర్‌/ఎంఎస్‌డ‌బ్ల్యూ గ్రేడ్‌- II- 1, జనరల్ డ్యూటీ అటెండెంట్-13, పోస్టుమార్టం అసిస్టెంట్‌-3, థియేట‌ర్ అసిస్టెంట్‌-5, ఆఫీస్ స‌బార్డినేట్ -3 పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. డెంట‌ల్ టెక్నిషియ‌న్‌, ల్యాబ్ టెక్నిషియ‌న్ పోస్టుల‌ను కాంట్రాక్ట్ ప‌ద్దతిలో భ‌ర్తీ చేయ‌నుండగా.. మిగిలిన పోస్టుల‌ను అవుట్ సోర్సింగ్ ప‌ద్ద‌తిలో భ‌ర్తీ చేస్తారు.

జీతం ఎంత..

1. డెంట‌ల్ టెక్నిషియ‌న్‌- రూ. 32,670

2. ల్యాబ్ టెక్నిషియ‌న్‌- రూ. 32,670

3. ఎలక్ట్రీషియన్-రూ.18,000

4. కౌన్సిలర్‌/ఎంఎస్‌డ‌బ్ల్యూ గ్రేడ్‌- II - రూ.21,500

5. జనరల్ డ్యూటీ అటెండంట్- రూ.15,000

6. పోస్టుమార్టం అసిస్టెంట్‌- రూ.15,000

7. థియేట‌ర్ అసిస్టెంట్‌- రూ.15,000

8. ఆఫీస్ స‌బార్డినేట్ -రూ.15,000

వ‌యో ప‌రిమితి..

2025 జ‌నవ‌రి 1 నాటికి వ‌య‌స్సు 18 నుంచి 42 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు ఐదేళ్ల వ‌య‌స్సు స‌డ‌లింపు ఉంటుంది. ఎక్స్ స‌ర్వీస్‌మెన్ అభ్య‌ర్థుల‌కు మూడేళ్లు, దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు స‌డ‌లింపు ఉంటుంది. అయితే 52 ఏళ్ల వ‌య‌స్సు దాట‌కూడ‌దు.

అప్లికేష‌న్ ఫీజు..

అప్లికేష‌న్ ఫీజు ఓసీ అభ్య‌ర్థుల‌కు రూ.500 ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడ‌బ్ల్యుఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.200 ఉంటుంది. దివ్యాంగ అభ్య‌ర్థుల‌కు ఫీజు మిన‌హాయింపు ఉంటుంది.

ఎంపిక ప్ర‌క్రియ‌..

ఎంపిక ప్ర‌క్రియ‌లో వంద మార్కులు ఉంటాయి. అందులో విద్యా అర్హ‌త‌లోని స‌బ్జెక్టుల్లో మార్కులకు 75 శాతం మార్కులు, అనుభ‌వానికి 15 శాతం మార్కులు కేటాయిస్తారు. కోర్సు పూర్తి చేసిన‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కు ఏడాదికి ఒక మార్కు కేటాయిస్తారు. అలా గ‌రిష్ఠంగా 10 శాతం మార్కులు కేటాయిస్తారు. అనుభ‌వానికి సంబంధించి గిరిజ‌న ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు 2.5 మార్కులు, గ్రామీణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే ప్ర‌తి ఆరు నెల‌ల‌కు 2 మార్కులు కేటాయిస్తారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప‌ని చేస్తే.. ప్ర‌తి ఆరు నెల‌ల‌కు ఒక మార్కు కేటాయిస్తారు. ఆరు నెల‌ల కంటే త‌క్కువ ఉన్న‌స‌ర్వీసుకు ఎటువంటి వెయిటేజ్ ఇవ్వ‌రు.

దరఖాస్తుకు జ‌త చేయాల్సినవి..

1. ప‌దో త‌ర‌గ‌తి మార్కుల జాబితా

2. పోస్టుల‌కు సంబంధించిన అర్హ‌త స‌ర్టిఫికేట్‌

3. అర్హ‌త ప‌రీక్ష‌కు హాజ‌రైన ఆధారం

4. అన్ని సంవ‌త్స‌రాల మార్కుల లిస్టులు

5. ఏపీ పారామెడిక‌ల్ బోర్డు, అలైడ్ హెల్త్ కేర్ సైన్స్‌, ఇత‌ర కౌన్సిల్ రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికేట్‌

6. నాలుగో త‌ర‌గ‌తి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు స్ట‌డీ స‌ర్టిఫికేట్లు

7. కుల ధ్రువీక‌ర‌ణ ప్ర‌తం

8. దివ్యాంగ అభ్య‌ర్థులు స‌ద‌రం స‌ర్టిఫికేట్‌

9. స‌ర్వీస్ స‌ర్టిఫికేట్‌

10. ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థులు సంబంధిత స‌ర్టిఫికేట్‌

ద‌ర‌ఖాస్తు ఇలా..

ద‌ర‌ఖాస్తు ఫార‌మ్ అధికార వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్‌‌లో ఉందుబాటులో ఉంటుంది. దాంతోపాటు డిక్ల‌రేషన్ కూడా ఇవ్వాలి. ద‌ర‌ఖాస్తు ఫార‌మ్, డిక్ల‌రేష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, వాటిని పూర్తి చేయాలి. ఆ దరఖాస్తు, డిక్ల‌రేష‌న్‌తో పాటు విద్యార్హ‌త‌లు, ఉద్యోగ అనుభ‌వాలతో కూడిన ఒక జిరాక్స్ కాపీ సెట్‌పై గెజిటెడ్ అధికారితో సంత‌కం చేయించాలి. ఆ ద‌ర‌ఖాస్తు సెట్‌ను జిల్లా వైద్యశాల‌ల స‌మ‌న్వ‌య అధికారి కార్యాల‌యంలో మార్చి 18 తేదీ సాయంత్రం 5 గంట‌లలోపు సమర్పించాలి.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)