AP Ekalavya Schools: ఏపీ ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో ఆరో తరగతి అడ్మిషన్లకు నోటిఫికేషన్, ఫిబ్రవరి 25న ప్రవేశపరీక్ష
AP Ekalavya Schools: ఆంధ్రప్రదేశ్ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సొసైటీ నిర్వహిస్తున్న పాఠశాలల్లో ఆరోతరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 25న రాతపరీక్ష నిర్వహిస్తారు. ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
AP Ekalavya Schools: ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో చేరేందుకు అర్హులైన విద్యార్థులు అడ్మిషన్ టెస్ట్‌కు నోటిఫికేషన్ విడుదలైంది.

ఏపీలోని పలు జిల్లాల్లో నిర్వహిస్తున్న ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 28 ఏకలవ్య గురుకుల పాఠశాలల్ని నిర్వహిస్తున్నారు. ఈ స్కూళ్లలో 2025-26 విద్యా సంవత్సరంలో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది.
రాజ్యాంగ నిబంధన 46 ప్రకారం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలలో విద్య విస్తరణకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాయి. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి 1997-98 సంవత్సరంలో ప్రవేశపెట్టిన మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్ల స్థాపన ద్వారా విద్యా అభివృద్ధికి ఒక చొరవ తీసుకున్నారు.
దేశంలోని వివిధ గిరిజన సాంద్రత కలిగిన రాష్ట్రాలలో 6 నుండి 12వ తరగతి వరకు 100 మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేయడానికి రాజ్యాంగం యొక్క 275 (1) అధికరణం కింద నిధులలో ఒక భాగాన్ని ఉపయోగించాలని గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.దీనికి అనుగుణంగా ఏపీలో 28 ఏకలవ్య మోడల్ గురుకుల స్కూల్స్ ఏర్పాటు చేశారు. ఈ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు గిరిజన విద్యార్థుల అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా శిక్షణ కల్పిస్తారు.
ప్రవేశాలు ఇలా…
ఏపీ ఏకలవ్య మోడల్ స్కూల్లో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్ధులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జనవరి 22వ తేదీ నుంచి దరఖాస్తులు వెబ్‌సైట్‌లో అందుబాటు ఉంటాయి. ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు కల్పిస్తారు.
ఏపీలో అడ్మిషన్ల కోసం ప్రవేశపరీక్షను ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తారు.
ఏకలవ్య మోడల్ స్కూల్లో అడ్మిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించండి. https://twreis.apcfss.in/
ప్రవేశపరీక్షకు హాజరయ్యేందుకు అర్హతలు, అందుబాటులో ఉన్న ఖాళీలు, పాఠశాలల వారీగా ఖాళీల వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాలకు గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల వెబ్‌సైట్, జిల్లా గిరిజన శాఖ కార్యాలయాల్లో సంప్రదించవచ్చు.