ఇప్పటి వరకు బీటెక్ వంటి సాంకేతిక విద్య చదివే వారికే.. క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇకనుంచి రెగ్యులర్ డిగ్రీలోనూ ఈ కోర్సులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కోర్సులకు సంబంధించి సిలబస్ రూపొందించే పనిలో ఉన్నత విద్యామండలి నిమగ్నమైంది. సింగిల్ మేజర్ స్థానంలో డబుల్ మేజర్ విధానాన్ని తీసుకురాబోతుంది. ఈ విధానం అమలు, సిలబస్ రూపకల్పనపై ఉన్నత విద్యామండలి ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ వెంకయ్య ఆధ్వర్యంలోని కమిటీ నివేదిక సమర్పించింది. దీనిపై మండలి ఛైర్మన్ కృష్ణమూర్తి విశ్వవిద్యాలయాల ఉపకులపతులతో వర్చువల్‌గా సమావేశం ఏర్పాటు చేశారు.
డిగ్రీలో తీసుకొస్తున్న మార్పులపై వీసీలకు వివరించి, వారి నుంచి కృష్ణమూర్తి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఉన్నత విద్యలో సంస్కరణల పేరుతో గత ప్రభుత్వం సింగిల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొచ్చింది. కానీ ఈ విధానంలో అన్ని రకాల సబ్జెక్టులను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలంటే.. ఎందరు అధ్యాపకులు అవసరమన్నది మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా కొన్ని ప్రభుత్వ కళాశాలల్లో కొన్ని సబ్జెక్టులు, మరికొన్నింటిలో ఇంకొన్ని పెట్టడంతో నచ్చిన సబ్జెక్టు చదివేందుకు దూరం వెళ్లలేక చాలామంది ప్రైవేట్ కళాశాలలకు వెళ్లిపోయారు.
ఇప్పుడు ఈ విధానంలో మార్పులు చేస్తూ.. యూజీసీ సూచనల ప్రకారం ఉన్నత విద్యామండలి డబుల్ మేజర్ సబ్జెక్టు విధానాన్ని తీసుకొస్తోంది. డిగ్రీలో విద్యార్థులు వారికి నచ్చిన రెండు సబ్జెక్టులు ప్రధానంగా ఎంపిక చేసుకుని చదవాల్సి ఉంటుంది. ప్రధాన మేజర్‌కు 48 క్రెడిట్లు, రెండో మేజర్‌కు 32 క్రెడిట్లు ఉంటాయి. దాదాపు రెండింటికీ సమ ప్రాధాన్యం వస్తుంది. ఫలితంగా రెండు సబ్జెక్టులను అభ్యర్థులు నేర్చుకుంటారు. ఈ రెండింటిలో ఏదో ఒక సబ్జెక్టు ప్రధానంగా పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ) చదువుకోవచ్చు.
డబుల్ మేజర్‌తో పాటు మైనర్ సబ్జెక్టులూ ఉంటాయి. ఇందులో క్వాంటం కంప్యూటింగ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్‌ను ఈ ఏడాది తీసుకొస్తున్నారు. వీటిలో బీఎస్సీ కంప్యూటర్స్ వాళ్లకు క్వాంటం కంప్యూటింగ్‌ను తప్పనిసరి చేయనున్నారు. మిగిలిన వారికి మైనర్ సబ్జెక్టులుగా నచ్చిన వారు ఎంపిక చేసుకునే వీలు కల్పించనున్నారు. ఇక బీఏ, బీకాం వాళ్లు సైతం ఆసక్తి ఉంటే వీటిని ఎంపిక చేసుకోవచ్చు. నైపుణ్యాభివృద్ధి కోర్సుల్లోనూ కొత్తగా డిజైన్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్‌ను తీసుకొస్తున్నారు.
ప్రస్తుతం ఉద్యోగావకాశాల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాధాన్యంగా ఉంది. సాధారణ డిగ్రీ విద్యార్థులు సైతం ఇలాంటి వాటిని నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఉన్నత విద్యామండలి భావిస్తోంది. పరిశ్రమలన్నీ ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నందునా.. విద్యార్థులకు అవగాహన ఉండాలనే ఉద్దేశంతో వీటిని తీసుకొస్తున్నారు. ఈ కొత్త కోర్సులు, మార్పులపై అధ్యాపకులకు శిక్షణ ఇవ్వనున్నారు.
డిగ్రీలో 2020-21 నుంచి మూడు విడతల ఇంటర్న్‌షిప్‌ను తీసుకొచ్చారు. తొలి ఏడాది పూర్తయ్యాక వేసవి సెలవుల్లో రెండు నెలల కమ్యూనిటీ సర్వీసు ప్రాజెక్టు చేయాలి. రెండో ఏడాది పూర్తయ్యాక సెలవుల్లో రెండు నెలలపాటు తాము చదువుతున్న సబ్జెక్టులపై రెండో ఇంటర్న్‌షిప్ చేయాలి. మూడో ఏడాదిలో ఐదు లేదా ఆరో సెమిస్టర్‌లో సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌ను తెచ్చారు. మూడు విడతలుగా ఉన్న దీన్ని.. ఇప్పుడు ఒక్క సెమిస్టర్‌కే పరిమితం చేసేలా ప్రణాళిక రూపొందించారు.
రెండు స్వల్పకాలిక ఇంటర్న్‌షిప్‌ల వల్ల విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని.. అధికారుల పరిశీలనలో తేలడంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటన్నింటితో నూతన కరిక్యులం రూపొందించిన ఉన్నత విద్యామండలి దీన్ని ప్రభుత్వానికి సమర్పించనుంది. ఆ తర్వాత సర్కారు ఉత్తర్వులు ఇస్తే.. వర్సిటీలు అకడమిక్ విభాగంలో ఆమోదం తీసుకొని, అమలు చేయాల్సి ఉంటుంది.
సంబంధిత కథనం