NEET UG 2025: నీట్ యూజీ 2025 కి సంబంధించి ఎన్టీఏ కీలక ప్రకటన; ఆ కోర్సుల్లో అడ్మిషన్లు కూడా..
NEET UG 2025: నీట్ యూజీ-2025ను పెన్ అండ్ పేపర్ మోడ్ (ఓఎంఆర్ ఆధారిత)లో సింగిల్ డే, సింగిల్ షిఫ్టులో నిర్వహించాలని ఎన్టీఏ రెండు రోజుల క్రితం ప్రకటించింది. ఆ ప్రకటనకు అనుబంధంగా మరో అప్ డేట్ ను శనివారం విడుదల చేసింది.
NEET UG 2025: నీట్ యూజీ స్కోర్ లను ఉపయోగించి పొందే అడ్మిషన్లకు సంబంధించి ఒక కీలక అప్డేట్ ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) వెల్లడించింది. నీట్ యూజీ 2025 నిర్వహణ విధానంపై 2025 జనవరి 16న జారీ చేసిన పబ్లిక్ నోటీసుకు కొనసాగింపుగా, ఈ అప్ డేట్ ఉంటుందని శనివారం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొంది.

ఈ కోర్సులు కూడా..
2025 జనవరి 16 నాటి పబ్లిక్ నోటీస్ లో పేర్కొన్న కోర్సులతో పాటు, నీట్ యూజీ-2025 స్కోర్, మెరిట్ లిస్ట్ బీడీఎస్, బీవీఎస్సీ, ఏహెచ్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా వర్తిస్తాయి’’ అని ఎన్టీఏ స్పష్టం చేసింది. నీట్ యూజీ 2025ను పెన్ అండ్ పేపర్ మోడ్ (ఓఎంఆర్ ఆధారిత)లో సింగిల్ డే, సింగిల్ షిఫ్టులో నిర్వహించనునున్నట్లు రెండు రోజుల క్రితం ఎన్టీఏ వెల్లడించింది. అదేవిధంగా, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్, 2020 లోని సెక్షన్ 14 ప్రకారం, ఈ చట్టం కింద నిర్వహించబడే అన్ని వైద్య సంస్థలలో ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యొక్క ప్రతి విభాగంలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు అంటే బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్ఎంఎస్ కోర్సులలో ప్రవేశానికి ఒకే నీట్ (neet) యూజీ ఉంటుంది. నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి కింద బీహెచ్ఎంఎస్ కోర్సులో ప్రవేశాలకు కూడా నీట్ యూజీ వర్తిస్తుంది. 2025 సంవత్సరానికి ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీస్ ఆస్పత్రుల్లో నిర్వహించే B.Sc నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే ఎంఎన్ఎస్ (మిలిటరీ నర్సింగ్ సర్వీస్) అభ్యర్థులు నీట్ యూజీ లో అర్హత సాధించాల్సి ఉంటుంది. నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సుకు షార్ట్ లిస్టింగ్ కోసం నీట్ యూజీ స్కోరును ఉపయోగిస్తారు’’ ఎన్టీఏ వెల్లడించింది. మరింత సమాచారం కోసం, ఎన్టీఏ అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.