ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల తేదీలు మార్పు, ఇవిగో వివరాలు-minor changes in ap dsc exam schedule 2025 key details here ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల తేదీలు మార్పు, ఇవిగో వివరాలు

ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్ - పరీక్షల తేదీలు మార్పు, ఇవిగో వివరాలు

ఏపీ డీఎస్సీ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 20, 21న జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను విద్యాశాఖ మార్చింది. ఆయా పరీక్షలు వచ్చే నెల 1,2 తేదీల్లో నిర్వహించనున్నట్లు తెలిపింది. యోగా డే సందర్భంగా డీఎస్సీ పరీక్షలు తేదీలు మార్చినట్లు వెల్లడించింది.

ఏపీ డీఎస్సీ పరీక్షలు

ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలు కొనసాగుతున్నాయి. అయితే విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. పరీక్షల షెడ్యూల్ లో స్వల్ప మార్పులను చేసింది. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించినది. ఈ నేపథ్యంలో జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన డీఎస్సీ పరీక్షల తేదీలను మార్పు చేస్తున్నట్లు డీఎస్సీ కన్వీనర్ ఎం.వి.కృష్ణా రెడ్డి శనివారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

స్వల్ప మార్పులు…

యోగా డే సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను దృష్టిలో ఉంచుకుని వారి రాకపోకలకు అంతరాయం కలగకూడదనే ఉద్దేశంతో ఈ పరీక్షల తేదీలు మార్చినట్లు తెలిపారు. ఈ అభ్యర్థులకు జూలై 1, 2 తేదీల్లో పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి సంబంధించి పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలను మార్చిన హాల్ టిక్కెట్లను https://apdsc.apcfss.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. జూన్ 25వ తేదీన వీటిని వెబ్ సైట్ లో ఉంచుతామని ప్రకటించారు.

అభ్యర్ధులు ఈ విషయాన్ని గమనించి మార్చిన హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఎస్సీ కన్వీనర్ సూచించారు. వాటి ప్రకారం పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని ప్రకటించారు.

ఏపీ డీఎస్సీ కీలు ఎప్పుడంటే…?

విద్యాశాఖ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం…. డీఎస్సీ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలను పరీక్షలు పూర్తయిన రెండు రోజుల్లో విడుదల చేస్తారు. అంటే జున్ 30వ తేదీతో ఎగ్జామ్స్ ముగుస్తాయి. జూలై 2వ తేదీన ప్రాథమిక కీలను విడుదల చేస్తారు.

విద్యాశాఖ విడుదల చేసే ప్రాథమిక కీలపై 7 రోజులపాటు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన మరో 7 రోజుల తర్వాత ఫైనల్ కీలను అందుబాటులోకి తీసుకువస్తారు. తుది కీ విడుదల చేసిన మరో ఏడు రోజుల తర్వాత మెరిట్ జాబితాలు విడుదలవుతాయి. అంటే ఆగస్టు నాటికి డీఎస్సీ పరీక్షల మెరిట్ జాబితాలపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ కీలను విడుదల చేసే విషయం లేదా అభ్యంతరాలను పరిశీలించే విషయంలో ఒకటి రెండు ఆలస్యమైతే…. ఒకటి రెండు రోజులు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుంది.

ఏపీ మెగా డీఎస్సీలో భాగంగా…. మొత్తం 16,347 పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈసారి ఈ మెగా డీఎస్సీలోని అన్ని ఖాళీలకు కలిపి 5,77,417 అప్లికేషన్లు అందాయి. పలువురు అభ్యర్థులు వారి అర్హతలకు అనుగుణంగా… ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.