నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో త్వరలో 12 వేల ఉద్యోగాల భర్తీ!-massive recruitment in telangana police department soon ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో త్వరలో 12 వేల ఉద్యోగాల భర్తీ!

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. తెలంగాణలో త్వరలో 12 వేల ఉద్యోగాల భర్తీ!

తెలంగాణలో మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ శాఖలో దాదాపు 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

తెలంగాణలో ఉద్యోగాల భర్తీ (unsplash)

తెలంగాణ పోలీసు శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉండొచ్చని ఉన్నతాధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇటీవల పోలీస్ శాఖలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నారు.

బాంబు పేలుళ్ల తర్వాత..

పోలీస్ శాఖలో వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలనే భర్తీ చేస్తుంటారు. కానీ 2007లో హైదరాబాద్‌లో బాంబు పేలుళ్లు జరిగాక... పోలీస్ శాఖను బలోపేతం చేయాలని సంకల్పించారు. దీంతో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 35 వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే.. ఒకేసారి ఇన్ని పోస్టులను భర్తీ చేయడం సాధ్యంకాదని.. అందుకే పలు దఫాలుగా నియామక ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

17 వేల పోస్టులు భర్తీ..

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటం, ప్రభుత్వాలు మారడం వంటి కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతోంది. కొత్తగా మంజూరైన పోస్టుల చివరిదఫా నియామక ప్రక్రియ 2022 సంవత్సరంతో పూర్తయింది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి 17 వేల పోస్టులను భర్తీ చేసింది. 2022లో చేపట్టిన నియామక ప్రక్రియలో ఎంపికై, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి.. 2024లో రేవంత్‌ రెడ్డి నియామకపత్రాలు అందించారు.

మరోసారి భారీ స్థాయిలో..

తాజాగా మరోసారి భారీ ఎత్తున పోస్టులను భర్తీ చేయడానికి అధికారులు సిద్ధం అవుతున్నారు. కానిస్టేబుల్, ఎస్సై స్థాయిలో దాదాపు 12 వేల వరకు ఖాళీలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశముందని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. దానికి కారణం.. ఉద్యోగ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 61 ఏళ్లకు పెంచుతూ 2021 ఏప్రిల్‌లో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో ఆ ఏడాది పదవీ విరమణ చేయాల్సి వారు 2024 మార్చి వరకు కొనసాగారు.

ప్రభుత్వం ఆదేశిస్తే..

2024 ఏప్రిల్‌ నుంచి మళ్లీ ఉద్యోగ విరమణలు మొదలయ్యాయి. వీటిని భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశిస్తే.. వెంటనే నియామక ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ పోస్టులను ఎలా భర్తీ చేస్తారు.. ఎప్పుడు భర్తీ చేస్తారనే వివరాలు త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ ఉద్యోగాల కోసం వేలాది మంది శిక్షణ పొందుతున్నారు. నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత కథనం