T-SAT Free Course : హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారా..? మీకోసమే టీ-శాట్ స్పెషల్ క్లాసులు, ఇవిగో వివరాలు
'హిందీ నేర్చుకోవాలనుకునే వారికి టీ-సాట్' గుడ్ న్యూస్ చెప్పింది. అలాంటి వారి కోసం ప్రత్యేక లెసన్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. మొత్తం 30 రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుంది. ఫిబ్రవరి 13వ తేదీ వరకు ప్రసారాలు ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది.
విద్యార్థినీ, విద్యార్థులు పలు భాషలను నేర్చుకునేందుకు వీలుగా టి-సాట్ నెట్వర్క్ చర్యలు చేపడుతోంది. ఇప్పటికే పలు బాషలను అందుబాటులోకి తీసుకురాగా.. తాజాగా హిందీ భాషపైనా ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలు ప్రసారం చేసేందుకు షెడ్యూల్ ఖరారు చేసింది. అరగంట నిడివిగల పాఠ్యాంశాలను 30 రోజులు ప్రసారం చేయనుంది. ఇప్పటికే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనుభవం కలిగిన ఫ్యాకల్టీ బోధించిన లెసన్స్ ప్రసారం కానున్నాయి.
ప్రతిరోజూ అరగంట…
తెలంగాణలోని విద్యార్థినీ విద్యార్థులు హిందీ మాట్లాడటంలో ప్రావీణ్యం కల్పించేందుకు టి-సాట్ ప్రత్యేక డిజిటల్ పాఠ్యాంశాలు సిద్ధం చేసిందని సీఈవో వేణుగోపాల్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అనుభవం కలిగిన అధ్యాపకులచే బోధించబడిన పాఠ్యాంశాలను ప్రతి రోజూ అరగంట పాటు ప్రసారం చేస్తున్నట్లు వివరించారు.
ఫిబ్రవరి 13 వరకు…
నిపుణ ఛానల్ లో మధ్యాహ్నాం 1.30 గంటలకు, విద్య ఛానల్ లో సాయంత్రం 6.30 గంటలకు ప్రసారం అవుతున్నాయి. జనవరి 11వ తేదీ నుండి ప్రారంభమైన ఈ పాఠాలు… ఫ్రిబవరి 13వ తేదీ వరకు ఉంటాయి. శుక్రవారాలు మినహా మిగతా రోజుల్లో ఈ పాఠాలు ప్రసారం చేయనున్నట్లు సీఈవో ప్రకటించారు.
డిజిటల్ పాఠ్యాంశాలు టి-సాట్ యూట్యూబ్ తో పాటు, యాప్ లోనూ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు పాఠ్యాంశాలను సక్రమంగా వినియోగించుకునే విధంగా వారి తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సీఈవో వేణుగోపాల్ రెడ్డి కోరారు. హిందీ భాష నేర్చుకోవాలనుకునే వారు 040 – 23540326,726 లేదా 1800 425 4039 లకు కాల్ చేయాలని సూచించారు.
సంబంధిత కథనం