విద్యార్థులకు అలర్ట్ - డిగ్రీ 'స్పాట్ అడ్మిషన్లు' ప్రారంభం, ఇదే ఫైనల్ ఛాన్స్..!-key update about telangana dost spot admissions 2025 ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  విద్యార్థులకు అలర్ట్ - డిగ్రీ 'స్పాట్ అడ్మిషన్లు' ప్రారంభం, ఇదే ఫైనల్ ఛాన్స్..!

విద్యార్థులకు అలర్ట్ - డిగ్రీ 'స్పాట్ అడ్మిషన్లు' ప్రారంభం, ఇదే ఫైనల్ ఛాన్స్..!

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ తుది దశకు చేరింది. అయితే ఇవాళ్టి నుంచి విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు తీసుకోవచ్చు. ఈ గడువు కూడా ఆగస్ట్ 14వ తేదీతో ముగియనుంది. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు 2025

దోస్త్ ప్రవేశాలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే అన్ని విడతలు పూర్తి కాగా… ఇవాళ్టి నుంచి స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయింది. అర్హులైన విద్యార్థులు… ఇవాళ, రేపు స్పాట్ ప్రవేశాల కింద డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఈ మేరకు ఇప్పటికే అధికారులు షెడ్యూల్ ను కూడా విడుదల చేశారు.

ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ ప్రకారం… రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను 3 విడతల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగానే 3 విడతలు చేపట్టినప్పటికీ…. సీట్లు భారీగానే మిగిలాయి. అయితే స్పెషల్ ఫేజ్ కు అవకాశం కల్పించి… సీట్లను కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు రిపోర్టింగ్ చేసే గడువు ఆగస్ట్ 12తో పూర్తి అయింది.

స్పాట్ అడ్మిషన్ల తేదీలు…

ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్టు 11 నుంచి 12 వరకు రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపటాల్సి ఉంది. అయితే ఈ తేదీలను ఇటీవలే మార్చారు. దీంతో ఈ ప్రక్రియ ఇవాళ్టి నుంచి షురూ అయింది. రేపటి(ఆగస్ట్ 14) వరకు స్పాట్ అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుందని దోస్త్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ఎయిడెడ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు చేపడుతారు.దోస్త్ స్పాట్ అడ్మిషన్లలో భాగంగా సీట్లు పొందే వారికి స్కాలర్ షిప్స్ అవకాశం ఉండదని అధికారులు ప్రకటించారు.

స్పాట్ అడ్మిషన్ల విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానికేతర విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందొచ్చని అధికారులు తెలిపారు. అయితే ఒక కాలేజీలో ఒకటే సీటు ఉంటే స్థానిక, స్థానికేతర విద్యార్థులు పోటీపడితే తొలి ప్రాధాన్యం మాత్రం స్థానిక విద్యార్థులకు ఇస్తామని స్పష్టం చేశారు.

ఇక దోస్త్ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ సీట్లను ఆగస్టు 6న కేటాయించిన సంగతి తెలిసిందే. మొత్తం 57,338 మంది వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోగా, 54,048 మంది సీట్లు పొందారు. సీట్లు పొందిన వారు ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకోవటంతో పాటు కాలేజీల్లో కూడా రిపోర్టింగ్ ఇచ్చారు. వీటి ఆధారంగా మిగిలిపోయిన సీట్లను స్పాట్ అడ్మిషన్ల కింద భర్తీ చేస్తారు. మరోవైపు జూన్ చివరి వారం నుంచి డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమై… కొనసాగుతున్నాయి.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

టాపిక్