జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్- జేఈఈ మెయిన్స్ 2026కు హాజరు కావాలని ప్లాన్ చేస్తున్న విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఒక ముఖ్యమైన నోటీసును విడుదల చేసింది. పరీక్షకు దరఖాస్తు చేసుకునే ముందు అప్లికేషన్ లేదా అడ్మిషన్ ప్రక్రియలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు అభ్యర్థులు తమ ముఖ్యమైన డాక్యుమెంట్లను సరిచూసుకుని, అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.
జేఈఈ మెయిన్స్ 2026 పరీక్ష రెండు సెషన్లలో (జనవరి 2026, ఏప్రిల్ 2026) జరగనుంది.
మొదటి సెషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం అక్టోబర్ 2025లో అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inలో అందుబాటులో ఉంటుంది.
ఎన్టీఏ సలహా ప్రకారం.. విద్యార్థులు ఈ కింది డాక్యుమెంట్లు ఖచ్చితంగా, అప్డేటెడ్గా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి:
ఆధార్ కార్డు: మీ పేరు, పుట్టిన తేదీ (10వ తరగతి సర్టిఫికెట్ ప్రకారం), లేటెస్ట్ ఫోటోగ్రాఫ్, అడ్రస్, తండ్రి పేరు ఖచ్చితంగా ఉండాలి.
యూడీఐడీ కార్డు (వికలాంగుల కోసం): ఈ కార్డు చెల్లుబాటులో ఉండాలి. అవసరమైతే రెన్యూ చేయించుకోవాలి.
కేటగిరీ సర్టిఫికెట్: ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ లేదా ఓబీసీ-ఎన్సీఎల్ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే, అప్‌డేట్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
ఈ పత్రాలలో పొరపాట్లు ఉంటే దరఖాస్తు తిరస్కరణకు దారితీయవచ్చని లేదా తరువాత ఇతర సమస్యలను సృష్టించవచ్చని ఎన్టీఐ హెచ్చరించింది. అందుకే, వాటిని తక్షణమే అప్‌డేట్ చేసుకోవడం వల్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమైనప్పుడు చివరి నిమిషం ఒత్తిడిని నివారించవచ్చని పేర్కొంది.
అభ్యర్థులు ఎప్పటికప్పుడు తాజా నోటీసులు, సూచనలు, ముఖ్యమైన తేదీల కోసం అధికారిక వెబ్‌సైట్‌లు – nta.ac.in, jeemain.nta.nic.in – ను క్రమం తప్పకుండా సందర్శించాలని కూడా సలహా ఇచ్చింది.
ఎన్ఐటీలు, ఐఐటీలు సహా ఇతర కేంద్ర నిధులతో నడిచే సాంకేతిక సంస్థలలో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్ ఒక ద్వారం లాంటిది. అంతేకాకుండా, ఇది ఐఐటీలలో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత పరీక్షగా కూడా పనిచేస్తుంది. ఈ అగ్రశ్రేణి ఇంజినీరింగ్ కళాశాలలను లక్ష్యంగా చేసుకున్న విద్యార్థులు తమ డాక్యుమెంట్లను ముందుగానే అప్‌డేట్ చేసుకుని, ఎన్టీఏ నుంచి వచ్చే అన్ని ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలి.
సంబంధిత కథనం