JEE Mains 2025 : కార్గిల్ లో పేపర్-1, విశాఖలో పేపర్-2, జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో గందరగోళం
JEE Mains 2025 : జేఈఈ మెయిన్స్ 2025 ఇమేజ్ కరెక్షన్ విండో నేటి రాత్రితో ముగియనుంది. ఫొటో అప్లోడ్ కు ఎన్టీఏ పలు కీలక సూచనలు చేసింది. ఇదిలా ఉంటే ఎన్టీఏ విడుదల చేసిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు చూసి అభ్యర్థులు షాక్ తింటున్నారు. విద్యార్థుల పరీక్ష కేంద్రాలు ఎక్కడెక్కడో ఇచ్చారని ఆందోళన చెందుతున్నారు.
JEE Mains 2025 : బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాలకు(2025-26) నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జనవరి 22 నుంచి జేఈఈ మెయిన్స్ తొలి విడత పరీక్షలు నిర్వహిస్తుంది. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు ఎన్టీఏ విడుదల చేసింది. పరీక్షకు మూడ్రోజుల ముందు అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు. ఇటీవల కాలంలో పరీక్ష పేపర్ల లీకేజీ కారణంగా ఎన్టీఏ జాగ్రత్తలు తీసుకుంటుంది. అయితే సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల్లో పరీక్ష కేంద్రాల వివరాలు ఉంటాయి. ఈ వివరాలు చూసి అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు లద్దాఖ్ లోని కార్గిల్ లో పరీక్ష కేంద్రం కేటాయించడంతో షాక్ కు గురయ్యారు.

పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ చదువుతున్న తేజ చరణ్, సాయి లోకేశ్ జేఈఈ మెయిన్స్ కు అప్లై చేసుకున్నారు. ఎన్టీఏ తాజాగా విడుదల చేసిన పరీక్ష కేంద్రాల వివరాలను చెక్ చేసుకున్నారు. ఈ విద్యార్థులు సెలెక్ట్ చేసుకున్న పరీక్ష కేంద్రాలకు బదులు ఎక్కడెక్కడో ఎగ్జామ్ సెంటర్స్ రావడం చూసి షాకయ్యారు. జనవరి 29న జరిగే జేఈఈ మెయిన్ పేపర్-1 (బీటెక్)కు లద్దాఖ్‌లోని కార్గిల్‌లో కేంద్రాన్ని కేటాయించారు. జనవరి 30న జరిగే పేపర్-2(బీఆర్క్) పరీక్ష విశాఖపట్నంలో కేటాయించారు. దీంతో విద్యార్థుల ఎన్టీఏను సంప్రదించినప్పటికీ సరిగ్గా స్పందించలేదని ఆందోళన చెందుతున్నారు.
ఇమేజ్ కరెక్షన్ విండో
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ సెషన్-1 ఇమేజ్ కరెక్షన్ విండో గడువు శుక్రవారం రాత్రి 11:50 గంటలకు ముగియనుంది. ఫొటోలలో తప్పులను గుర్తించిన ఎన్టీఏ(jeemain.nta.nic.in)... తమ ఫొటోలను తిరిగి అప్లోడ్ చేయాలని అభ్యర్థులకు సూచించింది. కొంతమంది అభ్యర్థుల ఫొటోలు అవసరమైన స్పెసిఫికేషన్ల ప్రకారం లేవని గమనించిన ఏజెన్సీ కరెక్షన్ విండోను తెరిచింది. ఈ విషయాన్ని అభ్యర్థుల ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేసింది. అభ్యర్థులు దరఖాస్తులు రిజెక్టు కాకుండా మళ్లీ ఫొటోను అప్లోడ్ చేయాలి. జేఈఈ మెయిన్స్ అప్లికేషన్ ఫారంతో పాటు ఫొటోలను అప్లోడ్ చేయడంపై ఎన్టీఏ పలు సూచనలు చేసింది.
ఫొటో అప్లైడ్ సూచనలు
- ఫొటో పరిమాణం 10 కేబీ నుంచి 300 కేబీ మధ్య ఉండాలి.
- మాస్క్ లేకుండా, తెలుపు బ్యాక్ గ్రౌండ్ తీసిన ఫొటో కలర్ లో ఉండాలి.
- ఫోటోలో చెవులతో సహా 80 శాతం ముఖాన్ని చూపించాలి.
- ఫోటోగ్రాఫ్ కు 'ఫోటోగ్రాఫ్' అని పేరు పెట్టాలి. JPG/JPEG ఫార్మాట్ లో ఉండాలి.
- కళ్లద్దాలను అభ్యర్థి క్రమం తప్పకుండా ఉపయోగిస్తేనే అనుమతిస్తారు.
- పోలరాయిడ్, కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోలను అంగీకరించరు.
- పోలరాయిడ్, కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోలు ఆమోదయోగ్యం కాదు.
- ఈ ఆదేశాలను పాటించని వారి దరఖాస్తులు తిరస్కరిస్తామని ఎన్టీఏ హెచ్చరించింది.
అభ్యర్థులు తర్వాతి దశల్లో అవసరమైన ఆరు నుంచి ఎనిమిది పాస్ పోర్ట్ సైజు కలర్ ఫోటోలను ఉంచుకోవాలని ఎన్టీఏ సూచించింది. అప్ లోడ్ చేసిన ఫొటోలు ఫ్యాబ్రికేటెడ్ గా లేదా హ్యాండ్ మేడ్ లేదా కంప్యూటర్ తో తయారైనవిగా కనిపిస్తే అభ్యర్థి దరఖాస్తును తిరస్కరిస్తారు. జేఈఈ మెయిన్స్ కు సంబంధించిన అప్డేట్స్ కోసం అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్ ను సందర్శించాలి. అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే ఎన్టీఏ హెల్ప్ డెస్క్ నంబర్ 011-40759000/ 011-6922770కు కాల్ చేయవచ్చు లేదా jeemain@nta.nic.in కు మెయిల్ చేయవచ్చు.
సంబంధిత కథనం