JEE Main 2025: జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 నేటితో ముగుస్తోంది; తరువాత ఏంటి?.. రిజల్ట్ ఎప్పుడు?
JEE Main 2025: జనవరి 30న జరిగే పేపర్ 2 పరీక్షతో జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ పరీక్షలు ముగుస్తున్నాయి. ఫలితాలను ఫిబ్రవరి 12, 2025 నాటికి ప్రకటిస్తామని పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ తెలిపింది.
JEE Main 2025: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ 2025 మొదటి సెషన్ నేటితో ముగియనుంది. చివరి రోజు అభ్యర్థులు రెండో పేపర్ (బీఆర్క్/బీప్లానింగ్)కు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు ఒకే షిఫ్టులో ఈ పేపర్ ఉంటుంది. జేఈఈ మెయిన్స్ 2025 మొదటి సెషన్ ఫలితాలను ఫిబ్రవరి 12, 2025 నాటికి ప్రకటిస్తామని జేఈఈ (JEE) పరీక్షకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ తెలిపింది.

జనవరి 29 వరకు..
జేఈఈ మెయిన్ 2025 సెషన్ 1 పేపర్ 1 (బీఈ/బీటెక్) జనవరి 22, 23, 24, 28, 29 తేదీల్లో జరిగింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పేపర్-1 పరీక్ష నిర్వహించారు. జేఈఈ మెయిన్స్ లో తదుపరి దశలో ప్రొవిజనల్ ఆన్సర్ కీని ప్రచురిస్తారు. దీనిని jeemain.nta.nic.in వెబ్ సైట్ లో అప్ లోడ్ చేస్తారు. ఇది రెండు లేదా మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది.
అభ్యంతరాలు తెలపవచ్చు..
ఈ ప్రొవిజనల్ ఆన్సర్ కీ పై విద్యార్థులు తమ అభ్యంతరాలను వెల్లడించవచ్చు. ప్రతి ప్రశ్నకు నాన్ రిఫండబుల్ ఫీజు చెల్లించడం ద్వారా అభ్యర్థులు తమ అభ్యంతరాలను తెలపాలి. నిర్ణీత సమయంలో చేసిన ఆన్లైన్, పెయిడ్ ఛాలెంజ్లను మాత్రమే ఎన్టీఏ స్వీకరిస్తుంది. సమర్థన/సాక్ష్యాధారాలు లేని సవాళ్లు, నిర్దేశిత లింక్ కాకుండా మరే ఇతర మాధ్యమంలో దాఖలైన వాటిని పరిగణనలోకి తీసుకోరు. విద్యార్థులు వ్యక్తపరిచిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి, తుది నిర్ణయం తీసుకుంటారు. ఆ తరువాత ఎన్టీఏ వెబ్సైట్ https://jeemain.nta.nic.in లో ఫైనల్ ఆన్సర్ కీని ప్రకటిస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా ఫలితాలను రూపొందిస్తారు.