H-1B visa FAQs : యూఎస్ స్టూడెంట్ వీసాని హెచ్-1బీ వీసాగా మార్చుకోవచ్చా?
H1B Visa : అమెరికాలో చదువుకు ఇచ్చే ఎఫ్-1 స్టూడెంట్ వీసాని హెచ్-1బీ వీసాగా మార్చుకోవచ్చా? అసలు ఎఫ్-1 వీసా అంటే ఏంటి? హెచ్-1బీ వీసా అంటే ఏంటి? పూర్తి వివరాలు..

అమెరికాలో చదువుకోవాలని, అక్కడ ఉద్యోగం చేయాలని చాలా మంది భారతీయులు కలలు కంటూ ఉంటారు. అమెరికాలో వరల్డ్ క్లాస్ యూనివర్సిటీల్లో, మంచి ఎక్స్పోజర్ లభిస్తుండటం ఇందుకు కారణం. ఇందులో భాగంగానే ఏటా లక్షలాది మంది భారతీయులు స్టూడెంట్ వీసా మీద అమెరికాకు వెళుతుంటారు. మరి మీరు కూడా అమెరికాలో చదువుకు ప్లాన్ చేస్తున్నారా? ఎఫ్-1 వీసా, హెచ్-1బీ వీసా అంటే ఏంటో అర్థం కావడం లేదా? అయితే ఇది మీకోసమే. అమెరికాలో చదువు కోసం ఇచ్చే ఎఫ్-1 వీసా అంటే ఏంటి? ఈ స్టూడెంట్ వీసాని ఉద్యోగాల కోసం ఇచ్చే హెచ్-1బీ వీసాగా మార్చుకోవచ్చా? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ప్రశ్న:- ఎఫ్-1 స్టూడెంట్ వీసా అంటే ఏంటి?
సమాధానం- ఎఫ్-1 వీసా అనేది నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా. అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు అంతర్జాతీయ విద్యార్థులకు ఈ వీసాలు జారీ చేస్తారు. ఈ వీసా పొందాలంటే, విద్యార్థులు ముందు గుర్తింపు పొందిన విశ్వవిద్యలయ్యాల్లో ఫుల్-టైమ్ స్టూడెంట్‌గా సీటు పొందాలి. అంతేకాదు అమెరికాలో చదువుకు సంబంధించి తగిన ఆర్థిక వనరులను కూడా చూపించాలి.
అంతేకాదు, చదువు ముగిసిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోతామని అప్లికెంట్లు స్పష్టంగా చెప్పాలి. అకాడమిక్ ప్రోగ్రామ్స్ డ్యూరేషన్ మొత్తాన్ని ఎఫ్-1 వీసా కవర్ చేస్తుంది. అయితే, ఈ ఎఫ్-1 స్టూడెంట్ వీసాతో పాటు సాధారణంగా తాత్కాలిక ఉద్యోగ అవకాశాల కోసం ఓపీటీ (ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్), సీపీటీ (కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్) వంటి ప్రోగ్రామ్స్‌కి అర్హత పొందొచ్చు. ఫలితంగా చదువు పూర్తైన తర్వాత కొంతకాలం అక్కడ ఉద్యోగం చేసుకోవచ్చు.
ప్రశ్న:- హెచ్-1బీ వీసా అంటే ఏంటి?
సమాధానం- నైపుణ్యం గల విదేశీ ఉద్యోగులు రిక్రూట్మెంట్ చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఈ హెచ్-1బీ వీసా. అమెరికాలో ఉద్యోగం, స్థిరపడాలన్న కోరికలు ఉన్న అంతర్జాతీయ విద్యార్థులకు ఈ హెచ్-1బీ వీసా చాలా చాలా కీలకం.
సాధారణంగా ఈ హెచ్-1బీ వీసాలో ఐటీ, ఫైనాన్స్, ఇంజినీరింగ్, హెల్త్‌కేర్, ఆర్కిటెక్చర్ వంటి రంగాలను కవర్ చేస్తారు.
హెచ్-1బీ వీసా స్పాన్సర్ చేయాలంటే కంపెనీలకు కూడా కొన్ని రూల్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ వద్ద సదరు కంపెనీ యజమాని ఎల్సీఏ (లేబర్ కండీషన్ అప్లికేషన్) ఫైల్ చేయాలి. యూఎస్ సిటీజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్‌కి ఫామ్ ఐ-129 సబ్మీట్ చేయాలి.
ప్రశ్న:- ఎఫ్-1 స్టూడెంట్ వీసాని హెచ్-1బీ వర్క్ వీసాగా మార్చుకోవచ్చా?
సమాధానం- మార్చుకోవచ్చు. కానీ దీనికి కొన్ని కండీషన్స్ ఉంటాయి.
ప్రశ్న:- ఎఫ్-1వీసాని హెచ్-1బీ వీసాగా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి?
సమాధానం- అమెరికాలోని సంస్థ ఉద్యోగాన్ని స్పాన్సర్ చేసేందుకు సిద్ధంగా ఉంటే, అంతర్జాతీయ విద్యార్థులు ఎఫ్-1 వీసాని హెచ్-1బీ వీసాకు మార్చుకోవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది చెప్పినంత సులభం కాదు.
హెచ్-1బీ వీసా అభ్యర్థి తరఫున యజమాని ఐ-129 ఫామ్ ఫైల్ చేయాలి. అయితే, హెచ్-1బీ వీసాల జారీకి అమెరికాలో కటాఫ్ ఉంటుంది! అంటే.. ప్రతియేటా కేవలం 65వేల జనరల్ స్లాట్స్ ఉంటాయి. మరో 20వేల స్లాట్స్‌ని రిజర్వ్‌లో ఉంచుతారు. పైగా వీటిని లాటరీ విధానంలో పిక్ చేస్తారు! అంటే, యజమాని అప్లై చేసిన వెంటనే హెచ్-1బీ వీసా రాకపోవచ్చు.
ఒక్కోసారి ఎఫ్-1 వీసా గడువు ముగిసి, హెచ్-1బీ వీసా పరిమితి మొదలవ్వడం మధ్య గ్యాప్ ఉంటుంది. దీనిని భర్తీ చేసేందుకు అభ్యర్థుల వీసాని అధికారులు పొడగించవచ్చు. ఫలితంగా హెచ్-1బీ స్టేటస్ అమల్లోకి వచ్చేంతవరకు అభ్యర్థులు లీగల్‌గా అమెరికాలో కొనసాగవచ్చు. యూఎస్సీఐఎస్ అనుమతితో సదరు అభ్యర్థి లీగల్‌గా అమెరికాలో పనిచేసుకోవచ్చు.
ఎఫ్-1 స్టూడెంట్ వీసా గడువు ముగిసి, హెచ్-1బీ వీసా రాకపోతే కష్టాలు మొదలవుతాయి! ఇలాంటి వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తారు. స్వదేశాలకు పంపించేస్తారు.
సంబంధిత కథనం