‘మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి’- ఇరాన్​లో నరకం చూస్తున్న భారత విద్యార్థులు..-iranian israeli conflict indian students in iran urge evacuation as tensions rise ,career న్యూస్
తెలుగు న్యూస్  /  career  /  ‘మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి’- ఇరాన్​లో నరకం చూస్తున్న భారత విద్యార్థులు..

‘మమ్మల్ని ఇండియాకు తీసుకెళ్లిపోండి’- ఇరాన్​లో నరకం చూస్తున్న భారత విద్యార్థులు..

Sharath Chitturi HT Telugu

ఇజ్రాయెల్​ దాడుల నేపథ్యంలో ఇరాన్​లోని భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందోళనలో కఠిన రోజులను గడుపుతున్నారు. ఎలాంటి దుర్ఘటనలు జరగకముందే, తమను ఇండియాకు తీసుకెళ్లిపోవాలని అభ్యర్థిస్తున్నారు.

టెహ్రాన్​లోని ఓ ప్రాంతంలో తాజా పరిస్థితి.. (REUTERS)

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలు ఇరు దేశాల ప్రజలతో పాటు ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇరాన్​లో చదువు కోసం వెళ్లిన భారత విద్యార్థులు.. తాజా పరిణామాల మధ్య నరకం చూస్తున్నారు. ఎటువైపు నుంచి ఏ మిసైల్​ దూసుకొస్తుందో అన్న భయం మధ్య తమను దేశం నుంచి తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.

ఇజ్రాయెల్​- ఇరాన్​ ఉద్రిక్తతలు.. నరకం చూస్తున్న భారత విద్యార్థులు!

జూన్ 12న ఇజ్రాయెల్ బాలిస్టిక్ దాడులు ప్రారంభించినప్పటి నుంచి "మూడు రోజులుగా నిద్రపోలేదని" ఇరాన్‌లో ఉన్న వందలాది మంది భారతీయ వైద్య విద్యార్థుల్లో ఒకరు తెలిపారు.

ఇంతిసాల్ మొహిదీన్ అనే భారత విద్యార్థి మీడియాతో మాట్లాడుతూ, "శుక్రవారం తెల్లవారుజామున 2:30 గంటలకు పెద్ద శబ్దాలకు నిద్రలేచాను. వెంటనే బేస్‌మెంట్‌కు పరుగుతీశాను. అప్పటి నుంచి ఎవరూ నిద్రపోలేదు," అని చెప్పాడు.

విద్యార్థుల హాస్టళ్లు, అపార్ట్‌మెంట్‌లకు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే పేలుళ్లు సంభవించాయని వార్తలు రావడంతో అటు ఇరాన్​లో ఉంటున్న భారతీయుల్లోనూ, ఇటు ఇండియాలోని వారి కుటుంబ సభ్యుల్లో భయం పెరిగింది.

పరిస్థితి విషమించకముందే తమను స్వదేశానికి తరలించాలని భారత ప్రభుత్వాన్ని విద్యార్థులు అభ్యర్థిస్తున్నారు.

టెహ్రాన్‌లోని షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్ మూడొవ సంవత్సరం చదువుతున్న 22 ఏళ్ల ఇంతిసాల్ మాట్లాడుతూ.. తన విశ్వవిద్యాలయంలోనే ప్రస్తుతం 350 మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారని తెలిపాడు. ఇంతిసాల్ జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని హంద్వారాకు చెందినవాడు.

"మేం మా అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్‌లో చిక్కుకుపోయాం. ప్రతి రాత్రి పేలుళ్లు వింటున్నాం. పేలుళ్లలో ఒకటి కేవలం 5 కి.మీ దూరంలోనే జరిగింది," అని అతను ఫోన్‌లో ఏఎన్‌ఐకి చెప్పాడు. విశ్వవిద్యాలయం తరగతులను నిలిపివేసిందని, బాంబు దాడి కారణంగా విద్యార్థులు బయట తిరగడం మానేశారని అతను తెలిపాడు.

ప్రతిష్టాత్మకమైన షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయంలో ఫీజులు కూడా తక్కువగా ఉండటంతో అనేక మంది భారతీయులు ఇక్కడికి చదువుకుంటూ ఉంటారు.

ఇజ్రాయెల్ దాడిలో మరణించిన ముగ్గురు ఇరాన్ అణు శాస్త్రవేత్తలు సైతం షాహిద్ బెహెష్టి విశ్వవిద్యాలయంలోనే ప్రొఫెసర్‌లుగా ఉన్నారని నివేదికలు సూచిస్తున్నాయి.

'భయంతో వణికిపోతున్నాం'

ఇదిలా ఉండగా, కెర్మాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్​లో మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న ఫైజాన్ నబీ మాట్లాడుతూ.. కెర్మాన్ టెహ్రాన్ కంటే కాస్త సురక్షితంగా ఉన్నప్పటికీ, భయం మాత్రం వేగంగా వ్యాపిస్తోందని చెప్పాడు.

"మా నగరంలో ఈరోజు తుపాకీ కాల్పుల శబ్దాలు విన్నాం. టెహ్రాన్‌లోని నా స్నేహితులు భయంతో వణికిపోతున్నారు. 3-4 రోజులకు సరిపడా తాగునీటిని నిల్వ ఉంచుకోవాలని మాకు సలహా ఇచ్చారు. పరిస్థితి అంత దారుణంగా ఉంది," అని అతను చెప్పాడు.

శ్రీనగర్‌కు చెందిన ఫైజాన్ మాట్లాడుతూ.. "రోజుకు పది సార్లు నా తల్లిదండ్రుల నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇంటర్నెట్ చాలా నెమ్మదిగా ఉంది. కనీసం వాట్సాప్ మెసేజ్ కూడా త్వరగా వెళ్లట్లేదు. మేం డాక్టర్లం కావడానికి ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు బతకడానికి ప్రయత్నిస్తున్నాం," అని చెప్పాడు.

ఇరాన్ యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్స్​ లో నాల్గొవ సంవత్సరం ఎంబీబీఎస్ చదువుతున్న మిధాట్ మాట్లాడుతూ.. దాడుల మొదటి రాత్రి చాలా భయంకరంగా గడిచిందని చెప్పింది.

"పేలుళ్లు కేవలం కొన్ని కిలోమీటర్ల దూరంలోనే జరిగాయి. అందరూ భయపడిపోయారు. నా కుటుంబం నాకు పదేపదే ఫోన్లు చేస్తోంది. మేం నిరంతరం వార్తలను పర్యవేక్షిస్తున్నాం," అని జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌కు చెందిన ఆ విద్యార్థిని చెప్పింది.

భారత రాయబార కార్యాలయం వాట్సాప్ ద్వారా సంప్రదింపుల్లో ఉన్నప్పటికీ, తన విశ్వవిద్యాలయం పెద్దగా మద్దతు ఇవ్వడందని ఆమె తెలిపింది. "మాలో చాలామంది భయపడి ఇంట్లోనే ఉంటున్నాం. ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలియదు," అని ఆమె చెప్పింది.

‘ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోండి..’

యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్​.. విద్యార్థులతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ, ఏఎన్‌ఐ మాట్లాడిన విద్యార్థులు భద్రతా సూచనలు, తదుపరి చర్యల కోసం భారత రాయబార కార్యాలయం సలహాలు, సమన్వయంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని చెప్పారు.

"పరిస్థితి మరింత దిగజారకముందే మమ్మల్ని తరలించాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్‌లను షేర్​ చేసింది. టచ్​లో ఉంది. కానీ మేం భయపడుతున్నాము. మమ్మల్ని ఇంటికి వెళ్లాలి," అని ఇరాన్​లోని భారతీయ విద్యార్థి చెప్పాడు.

భారత రాయబార కార్యాలయం సలహా

ఇరాన్​లోని భారతీయ పౌరులు, భారత విద్యార్థులు, భారతీయ సంతతికి చెందిన వారందరినీ ఇంట్లోనే ఉండాలని, అధికారిక ఛానెళ్లను పర్యవేక్షిస్తూ ఉండాలని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం కోరింది.

రాయబార కార్యాలయం భారతీయ పౌరుల కోసం అత్యవసర హెల్ప్‌లైన్‌లను కూడా జారీ చేసింది.

అదే సమయంలో భారతీయ విద్యార్థులను తరలించేందుకు ఇరాన్​లో మన రాయబార కార్యాలయం కృషిచేస్తోంది. ఇదే విషయంపై ఇరాన్​ని అభ్యర్థించింది.

భారత్​ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ఇరాన్​.. వాయు మార్గం మూసివేసినప్పటికీ భారతీయులను, భారతీయ విద్యార్థుల తరలించేందుకు సరిహద్దులు తెరిచే ఉన్నాయని పేర్కొంది.

ఈ మేరకు భారతీయులను తరలించేందుకు దౌత్యపరమైన మిషన్​కి ఇరాన్​ అంగీకరించింది.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్ వార్తలు​, ఆస్ట్రాలజీ- లైఫ్​స్టైల్​ గ్యాలరీ రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది.

సంబంధిత కథనం