ఐఐటీ కాన్పూర్‌లో రూ.3,750కే ఏఐ ట్రైనింగ్ కోర్సు.. 7 ప్రశ్నలకు 10 నిమిషాల్లో సమాధానాలు ఇస్తేనే!
AI Course : భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే. ఇప్పటికే దీనికోసం ప్రపంచం అంతా సిద్ధమవుతోంది. ఐఐటీ కాన్పూర్ కూడా ఏఐ నిపుణులను సిద్ధం చేసేందుకు తయారైంది. శిక్షణ పొందిన విద్యార్థులకు ఐఐటీ సర్టిఫికెట్లు కూడా ఇస్తుంది.
భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఐఐటీ కాన్పూర్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నిపుణులతో కూడిన సైన్యాన్ని సిద్ధం చేయనుంది. ఇందుకోసం ఈ సంస్థ పరిశ్రమ సహకారంతో శిక్షణ కోర్సులను ప్రారంభిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా విద్యార్థులు, ప్రొఫెషనల్స్ ఇందులో పాల్గొనగలుగుతారు. దీనిలో విద్యార్థులకు వారి స్వంత జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్‌లు, వెబ్‌సైట్‌లను క్రియేట్ చేయడం నేర్పుతారు. స్వయం సమృద్ధి సాధించడంతో పాటు కృత్రిమ మేధ ప్రాథమిక సూత్రాన్ని ఈ శిక్షణ నేర్పుతుంది. శిక్షణ పొందిన విద్యార్థులకు ఐఐటీ సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది.
భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) కాబట్టి ఏఐ రంగంలో పెద్ద సంఖ్యలో నిపుణుల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఏఐ శిక్షణ, ఇంటర్న్ షిప్ శిక్షణ కార్యక్రమాలను ప్రారంభిస్తోంది. ఇందులో దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దీని తరగతులు 2025 జనవరి 20 నుంచి ప్రారంభమవుతాయి.
నిపుణులతో శిక్షణ
ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు వర్చువల్ విధానం ద్వారా అభ్యర్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన సమాచారాన్ని అందిస్తారు. మొదటి దశలో కేవలం 25 మంది అభ్యర్థులకు మాత్రమే ఈ ప్రోగ్రామ్ కింద శిక్షణ ఇస్తారు. ఈ అభ్యర్థులను ప్రత్యేక ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. ఐఐటీకి చెందిన పది ప్రశ్నలకు కేవలం పది నిమిషాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రశ్నోత్తరాలు ఆన్‌లైన్‌లో ఉంటాయి. కనీసం ఏడు ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పిన వారు శిక్షణ కార్యక్రమానికి అర్హులు. ఎంపికైన అభ్యర్థులకు ఐఐటీ ప్రొఫెసర్లతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్‌లో బోల్ట్ నిపుణులు శిక్షణ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ శిక్షణ ఫీజు రూ.3750.
ఐఐటీ కాన్పూర్ ప్లేస్ మెంట్స్
ఇక ఐఐటీ కాన్పూర్‌లో ప్లేస్ మెంట్ విషయానికొస్తే తొలి దశ డ్రైవ్ ముగిసింది. ఇందులో 1035 మంది విద్యార్థులు 250కి పైగా మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు పొందారు. ఇందులో 28 మంది విద్యార్థులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే సంస్థలో ప్లేస్ మెంట్లు 13 శాతానికి పైగా పెరిగాయి. విదేశాల్లో లభించే ఉద్యోగాల గ్రాఫ్ కూడా 27 శాతానికి పైగా ఉంది. ఐఐటీల్లో మొదటి దశ ప్లేస్ మెంట్ డ్రైవ్ డిసెంబర్ 1న ప్రారంభమైంది.
డాయిష్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇంటెల్, క్వాల్కమ్, ఫెడెక్స్, మీషో, బీపీసీఎల్, మైక్రోసాఫ్ట్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, డేటాబ్రిక్స్, గూగుల్, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఎస్ఎల్బీ, మైక్రాన్, రిలయన్స్ వంటి 250కి పైగా ప్రఖ్యాత కంపెనీలు ఈ డ్రైవ్‌లో పాల్గొన్నాయి. ప్రతిసారీ మాదిరిగానే ఈ ఏడాది కూడా కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు అత్యధిక ప్యాకేజీ లభించింది. గత ఏడాది మొదటి విడతలో 913 మంది విద్యార్థులకు ఉద్యోగాలు లభించాయి. ఈ ఏడాది 1,035 మందికి వచ్చాయి. గతేడాది సగటు ప్యాకేజీ రూ.26.27 లక్షలుగా ఉంది. ఈసారి సగటు ప్యాకేజీ సుమారు రూ.30 లక్షలకు పెరిగింది.