Pariksha Pe Charcha : ప్రధాని కాకపోతే ఏ మంత్రిత్వ శాఖలో పని చేసేవారు? పరీక్షా పే చర్చలో మోదీ ఇంట్రస్టింగ్ ఆన్సర్
Pariksha Pe Charcha : విద్యార్థులతో పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. విద్యార్థులతో స్కిల్ డెవలప్‌మెంట్ గురించి మాట్లాడారు.

పరీక్షా పే చర్చ 2025 సందర్భంగా ప్రధాని మోదీ విద్యార్థులతో కీలక విషయాలు మాట్లాడారు. ఎనిమిదో విడత పరీక్షా పే చర్చ కార్యక్రమం దిల్లీలోని సుందర్ నర్సరీలో మెుదలైంది. పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడానికి విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పారు. తాను ప్రధాని కాకపోతే స్కిల్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీలో పనిచేసేందుకు ఇష్టపడేవాడినని ఆయన విద్యార్థులతో అన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో నైపుణ్యాభివృద్ధి కీలక పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ గుర్తు చేశారు. యువతకు సరైన నైపుణ్యాలను అందించడం వల్ల ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా సృజనాత్మకత పెరుగుతుందన్నారు.
ప్రధాని కాకపోతే
'మీరు ప్రధాని కాకపోతే మంత్రిగా ఉండి ఉంటే ఏ శాఖను ఎంచుకునేవారని నన్ను ఒకసారి అడిగారు. నైపుణ్యం చాలా ముఖ్యం కాబట్టి స్కిల్ డిపార్ట్‌మెంట్‌ను ఎంచుకుంటాను అని చెప్పా. తల్లిదండ్రులు కూడా పిల్లల నైపుణ్యాలపై దృష్టి పెట్టాలి. పిల్లలను గోడలకు కట్టేసి పుస్తకాల జైలుగా మారిస్తే పిల్లలు ఎప్పటికీ ఎదగలేరు. పిల్లలకు నచ్చినవరి కొన్ని చేస్తేనే వారు బాగా ఎదుగుతారు. జీవితంలో పరీక్షలే సర్వస్వమని బతకకూడదు.' అని ప్రధాని మోదీ అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ అవసరం
నైపుణ్యాల అభివృద్ధి అనేది కేవలం ఉపాధికి సంబంధించినది కాదని, సమాజానికి అర్థవంతంగా దోహదపడేలా వ్యక్తులను శక్తివంతం చేయడమేనని అన్నారు మోదీ. స్కిల్ ఇండియా మిషన్, ఆత్మనిర్భర్ భారత్ కింద ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. సంప్రదాయ విద్య అవసరమని, కానీ నేటి జాబ్ మార్కెట్‌లో ప్రాక్టికల్ స్కిల్ నాలెడ్జ్ చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి గుర్తు చేశారు. భవిష్యత్ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను సాధించడంపై విద్యార్థులు దృష్టి సారించాలని కోరారు. మన యువత సరైన నైపుణ్యాలను కలిగి ఉంటే మెరుగైన కెరీర్‌ను పొందడమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతదేశ పురోగతిని ముందుకు నడిపిస్తారని చెప్పారు.
తల్లిదండ్రులకు మోదీ సూచన
పిల్లల సామర్థ్యాన్ని, ఆసక్తిని అర్థం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు. వారి కోరికలు తెలుసుకోవాలని, చాలా మంది పిల్లలు పాఠశాలలో విఫలమవుతున్నారని, వారు మళ్లీ ప్రయత్నిస్తారని ప్రధాని మోదీ అన్నారు. జీవితం అస్తవ్యస్తంగా ఉండదని, జీవితంలో విజయం సాధించాలా లేక పుస్తకాల్లో విజయం సాధించాలా అనేది నిర్ణయించుకోవాలన్నారు. మీ వైఫల్యాలను మీ గురువులుగా చేసుకోవాలని మోదీ సూచించారు.
అందరికీ 24 గంటలే
విద్యార్థులకు టైమ్ టేబుల్ ప్రాముఖ్యత గురించి ప్రధాని మాట్లాడుతూ 'ప్రతి ఒక్కరికీ 24 గంటలు ఉంటాయి. కొందరు తమ లక్ష్యంపై దృష్టి సారించి, దాని కోసం కష్టపడి పనిచేయడం వల్ల గెలుస్తారు. ఈ సమయాన్ని వీలైనంతగా సద్వినియోగం చేసుకోవాలి. రేపు చేయాల్సిన పనుల జాబితాను తయారు చేయండి. మరుసటి రోజు అది ఏం చేశారో, ఏం చేయేదో చెక్ చేయండి. మనకు ఇష్టమైన సబ్జెక్టుపైనే ఎక్కువ సమయం గడుపుతాం. ఇతర సబ్జెక్టులకు కూడా సమయం ఇవ్వండి. వాటికి భయపడాల్సిన అవసరం లేదు. మన 24 గంటలను అత్యంత ఉత్పాదకంగా ఎలా మార్చవచ్చనే దానిపై దృష్టి పెట్టండి.' అని విద్యార్థులకు ప్రధాని మోదీ సూచించారు.